ఓమ్ని వ్యాన్‌ కథ ముగిసింది..

Maruti Suzuki Discontinues Omni Van After 35 Years of Service - Sakshi

తయారీ నిలిపివేసిన మారుతీ సుజుకీ 

న్యూఢిల్లీ: సుమారు 35 ఏళ్ల పాటు చౌక మల్టీపర్పస్‌ వాహనంగా (ఎంపీవీ) వాహనదారులకు చేరువయిన మారుతీ ఓమ్ని వ్యాన్‌ ఇకపై కనుమరుగు కానుంది. ఓమ్ని తయారీని నిలిపివేయాలని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా మార్చుకునేందుకు ఓమ్ని చాలా అనువుగా ఉంటోందని తెలిసిందే. మార్కెట్లోకి వచ్చి 35 ఏళ్లయినా ఇప్పటికీ ఓమ్ని వ్యాన్స్‌కి ఆదరణేమీ తగ్గలేదు. అమ్మకాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, వాహనాల భద్రతా/కాలుష్య ప్రమాణాలకు సంబంధించి కొంగొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఓమ్ని వ్యాన్‌ తయారీ నిలిపివేయాలని మారుతీ నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ తొలి కారు 800ను ప్రవేశపెట్టిన ఏడాది తర్వాత 1984లో ఓమ్ని వ్యాన్‌ను మారుతీ ప్రవేశపెట్టింది.  

యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టం (ఏబీఎస్‌), ఎయిర్‌బ్యాగ్స్, బీఎస్‌ 6 ప్రమాణాలు మొదలైనవాటిని తప్పనిసరిగా చేస్తూ ప్రభుత్వం నిబంధనలు చేసిన నేపథ్యంలో పలు వాహనాల తయారీ సంస్థలు అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ పాత కాలం నాటి మోడల్స్‌ నిలిపివేస్తున్నాయి. లేదా పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్‌ చేసి ప్రవేశపెడుతున్నాయి. ఆ క్రమంలోనే మారుతీ కూడా ప్రస్తుతం కొత్త భద్రతాప్రమాణాలకు అనుగుణంగా కొన్ని మోడల్స్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. మల్టీపర్పస్‌ వెహికల్‌ ’ఈకో’ వాహనానికి సంబంధించి కొత్త ఫీచర్స్‌తో అప్‌డేటెట్‌ వెర్షన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్, కో–డ్రైవర్‌ సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ లాంటివి ఈ ఫీచర్స్‌లో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top