మారుతీ.. టాప్‌గేర్

మారుతీ.. టాప్‌గేర్


నికర లాభం 42% వృద్ధి

* 10 శాతం పెరిగిన కార్ల విక్రయాలు

* ఏడు అనుబంధ కంపెనీల విలీనం

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 42 శాతం వృద్ధి సాధించింది. అమ్మకాలు జోరుగా ఉండటం, ముడి ఉత్పత్తుల ధరలు తగ్గడం, విదేశీ మారక ద్రవ్యం కదలికలు అనుకూలంగా ఉండడం, వ్యయ నియంత్రణ పద్ధతులు వంటి కారణాల వల్ల నికర లాభంలో మంచి వృద్ధి సాధించామని మారుతీ సుజుకీ తెలిపింది.



గత క్యూ2లో రూ.863 కోట్లుగా ఉన్న  నికర లాభం ఈ క్యూ2లో రూ.1,226 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్ ఆర్. సి. భార్గవ తెలిపారు. నికర అమ్మకాలు రూ.11,996 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.13,575 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.  గత క్యూ2లో రూ.16,000గా ఉన్న ఒక్కో కారుకు ఇచ్చిన డిస్కౌంట్ ఈ క్యూ2లో రూ.19,500కు పెరిగిందని తెలిపారు. మొత్తం కార్ల విక్రయాలు 3,21,898 నుంచి 10 శాతం వృద్ధితో 3,53,335కు పెరిగాయని పేర్కొన్నారు.

 

వచ్చే క్వార్టర్‌లోనూ ఇదే జోరు

సాధారణంగా డిసెంబర్‌లో విక్రయాలు తక్కువగా ఉంటాయని, కానీ రెండేళ్ల నుంచి దీనికి భిన్నంగా అమ్మకాలు జోరుగా ఉన్నాయని, వచ్చే క్వార్టర్‌లో కూడా ఇదే జోరు కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు భార్గవ చెప్పారు. తమ ఏడు అనుబంధ కంపెనీలను మారుతీలో విలీనం చేసే స్కీమ్‌కు మంగళవారం సమావేశమైన  కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని భార్గవ వెల్లడించారు.

 

రాయల్టీ చెల్లింపు ఇక రూపాయిల్లో...

 మారుతీ సుజుకీ కంపెనీ తన మాతృకంపెనీ సుజుకీకి కొత్త మోడళ్లకు  రాయల్టీని రూపాయిల్లో  చెల్లించనున్నది. వచ్చే ఏడాది మార్కెట్లోకి తెచ్చే కాంపాక్ట్ ఎస్‌యూవీ నుంచి రూపాయిల్లో రాయల్టీ చెల్లింపులను ప్రారంభిస్తామని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్.సి. భార్గవ చెప్పారు.  పాత మోడళ్లకు జపాన్ కరెన్సీ యెన్‌లోనే చెల్లింపులు జరుగుతాయని వివరించారు.



రాయల్టీని రూపాయిల్లో చెల్లించడం వల్ల కరెన్సీ ఒడిదుడుకుల నుంచి మారుతీ కంపెనీకి రక్షణ లభిస్తుందని నిపుణులంటున్నారు. జపాన్ కరెన్సీ యెన్‌లో రాయల్టీ చెల్లిస్తే మారుతీ నికర అమ్మకాల్లో ఈ చెల్లింపులు 5.6 శాతం నుంచి 6 శాతం వరకూ ఉండేవని,  రూపాయిల్లో చెల్లించడం వల్ల రాయల్టీ చెల్లింపులు ఇప్పుడు 5 శాతమే ఉంటాయని వారంటున్నారు.



వివిధ మోడళ్ల కార్ల అభివృద్ధిలో మారుతీ నిర్వర్తించే పాత్రను బట్టి రాయల్టీ చెల్లింపులు ఆధారపడి ఉంటాయని భార్గవ చెప్పారు. విడిభాగాల్లాగే రాయల్టీ కూడా ఒక విధమైన ఉత్పాదక వ్యయమేనని భార్గవ చెప్పారు.



ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మారుతీ సుజుకీ షేరు

2.4 శాతం వృద్ధితో రూ.4,495 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top