3 వారాలుగా మార్కెట్లు బుల్‌.. బుల్‌

Market rallies in 3 weeks- Bse 500 stocks gain - Sakshi

బీఎస్‌ఈ-500 కంపెనీలలో 95 శాతం లాభాల్లో

మొత్తం మార్కెట్‌ కేపిటలైజేషన్‌లో 93 శాతం వాటా

14 శాతం ర్యాలీ చేసిన సెన్సెక్స్‌, నిఫ్టీ 

కేంద్ర బ్యాంకుల లిక్విడిటీ చర్యల ఎఫెక్ట్‌

దేశవిదేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్‌-19ను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. ప్రధానంగా  కేంద్ర బ్యాంకులు ఫెడరల్‌ రిజర్వ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ బిలియన్లకొద్దీ డాలర్లను వ్యవస్థలోకి పంప్‌చేస్తుండటంతో ఈక్విటీలు ర్యాలీ చేస్తున్నాయి. అటు అమెరికా ఇండెక్స్‌ నాస్‌డాక్‌ ఇప్పటికే సరికొత్త గరిష్టాన్ని సాధించగా.. దేశీయంగా గత మూడు వారాల్లో మార్కెట్లు 14 శాతం బలపడ్డాయి. సెన్సెక్స్‌ 34,000, నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌లను దాటి కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో భాగమైన కౌంటర్లన్నీ దాదాపుగా బలపడటం విశేషం! వివరాలు  చూద్దాం..

93 శాతం
బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌ కంపెనీలలో 95 శాతం అంటే 477 షేర్లు.. గత మూడు వారాల్లో లాభపడుతూ వచ్చాయి. మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో వీటి వాటా దాదాపు 93 శాతానికి సమానంకాగా.. ఈసారి ర్యాలీ బ్లూచిప్స్‌నకే పరిమితంకాకుండా మార్కెట్‌ అంతటా విస్తరించడం విశేషం. ఈ సమయంలో కేవలం బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో 5 శాతానికి సమానమైన 24 షేర్లు నష్టపోయాయి. మే 18 నుంచి చూస్తే సెన్సెక్స్‌, నిఫ్టీ 14 శాతం పుంజుకోగా.. బీఎస్‌ఈలో యాక్టివ్‌గా ట్రేడయ్యే 2500 కౌంటర్లలో 82 శాతం వరకూ ఎంతోకొంత లాభపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి లభిస్తున్న నిధులు ఎఫ్‌పీఐలు, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌ తదితర సంస్థల ద్వారా దేశీ ఈక్విటీలలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇకపై మార్కెట్లపై ఈ ర్యాలీ కొనసాగకపోవచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుందని తెలియజేశారు. 

ఖుషీ ఖుషీగా
బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో 70 స్టాక్స్‌ గత మూడు వారాల్లో 30 శాతం లాభాలు ఆర్జించగా.. 12 స్టాక్స్‌ అయితే ఏకంగా 50 శాతానికంటే అధికంగా జంప్‌చేశాయి. జాబితాలో పలు కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా వొడాఫోన్‌ ఐడియా 125 శాతం, ఐడీబీఐ బ్యాంక్‌ 98 శాతం, ఐనాక్స్‌ లీజర్‌ 75 శాతం, ఐఎఫ్‌సీఐ 74 శాతం, క్వెస్‌ కార్ప్‌ 67 శాతం చొప్పున దూసుకెళ్లాయి. అయితే సద్భావ్‌ ఇంజినీరింగ్‌, క్యాప్రి గ్లోబల్‌, హిందుస్తాన్‌ జింక్‌, రెస్పాన్సివ్‌ ఇండస్ట్రీస్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ 11-6 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top