అమ్మకాల షాక్‌- మార్కెట్ల పతనం

Market plunges on US recession expectations - Sakshi

సెన్సెక్స్‌ 709 పాయింట్లు డౌన్‌

34,000 మార్క్‌ను కోల్పోయింది

214 పాయింట్లు పడిన నిఫ్టీ

10,000 పాయింట్ల దిగువకు

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకూ నష్టాలే

కోవిడ్‌-19 దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం క్షీణతను చవిచూడే వీలున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ తాజాగా వేసిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాకిచ్చాయి. దీంతో అమెరికా నుంచి ఆసియావరకూ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా దేశీయంగానూ ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు సమయం గడిచేకొద్దీ అమ్మకాలకు ఎగబడ్డారు. వెరసి సెన్సెక్స్‌ 709 పాయింట్లు పతనమై 33,538 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 214 పాయింట్లు కోల్పోయి 9,902 వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్‌ 34,000 పాయింట్లు, ఇటు నిఫ్టీ 10,000 పాయింట్ల మైలురాళ్ల దిగువన స్థిరపడ్డాయి. 2020లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరవచ్చని ఫెడ్‌ అంచనా వేసింది. అయితే అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే వడ్డీ రేట్లను నామమాత్ర(0-0.25 శాతం) స్థాయికి తగ్గించడంతో యథాతథ రేట్లను అమలు చేసేందుకు నిర్ణయించింది. కాగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 34,219- 33,480 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడగా.. నిఫ్టీ 10,112- 9,885 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

2 శాతం స్థాయిలో
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ సుమారు 3-1.5 శాతం మధ్య క్షీణించాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు తెలియజేశారు. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, జీ, ఎస్‌బీఐ, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, మారుతీ, ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, వేదాంతా 9-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఇండస్‌ఇండ్‌ 4.4 శాతం జంప్‌చేయగా.. హీరోమోటో, నెస్లే, పవర్‌గ్రిడ్‌ 0.7 శాతం స్థాయిలో బలపడ్డాయి.

ఐడియా వీక్‌
డెరివేటివ్స్‌లో ఐడియా 13 శాతం కుప్పకూలగా.. సెంచురీ టెక్స్‌, ఉజ్జీవన్‌, ఐబీ హౌసింగ్‌, కంకార్‌ 6.5-5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా..పీవీఆర్‌, ఎంజీఎల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఐజీఎల్‌, మణప్పురం, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, కమిన్స్‌, మైండ్‌ట్రీ, ఆర్‌ఈసీ 5-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.4-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1529 నష్టపోగా.. 1023 లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 919 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 501 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 491 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 733 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 813 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1238 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top