ఆగస్టులో నిదానించిన తయారీ

Manufacturing growth slowed in the month of August - Sakshi

నికాయ్‌ పీఎంఐ 51.7గా నమోదు

న్యూఢిల్లీ: దేశ తయారీ రంగ వృద్ధి ఆగస్టు మాసంలో నిదానించింది. తయారీ రంగ కార్యకలాపాలను సూచించే నికాయ్‌ ఇండియా తయారీ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 51.7కు తగ్గింది. ఇది జూలై నెలలో 52.3గా ఉంది. అయినప్పటికీ 50 పాయింట్ల మార్క్‌పైన తయారీ రంగ వృద్ధి నమోదవడం వరుసగా 13వ నెల. 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధి విస్తరణ దశలో ఉన్నట్టు, ఆ లోపు ఉంటే తగ్గిపోతున్నట్టు పరిగణిస్తారు. ‘‘భారత తయారీ రంగ వృద్ధి జోరు కొంత తగ్గినట్టు ఆగస్టు నెల గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఉత్పత్తి, నూతన ఆర్డర్ల రాకలో వృద్ధి నిదానంగా ఉండటాన్ని సూచిస్తోంది’’ అని ఈ నివేదికను రూపొందించిన ఐహెచ్‌ఎస్‌ మార్కెట్‌ ఆర్థికవేత్త ఆష్నాదోధియా అన్నారు.

మెరుగుపడిన దేశీ డిమాండ్‌ ...
దేశీయ డిమాండ్‌ పరిస్థితులు ముందటి నెల కంటే ఆగస్టులో నెమ్మదిగా మెరుగుపడినట్టు, నూతన ఎగుమతి ఆర్డర్లు ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత వేగాన్ని అందుకున్నట్టు పీఎంఐ డేటా తెలియజేస్తోంది. ఇక తయారీ కంపెనీలు ఆగస్టులో అధిక ఇన్‌పుట్‌ వ్య యాల భారాన్ని ఎదుర్కొన్నాయి. రూపాయి విలువ తగ్గడంతో ముడి పదార్థాలపై అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మార్జిన్లను కాపాడుకునేందుకు కంపెనీలు ధరలు పెంచాయని, అయినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత చూస్తే పెంపు పరిమితంగానే ఉన్నట్టు పీఎంఐ డేటా తెలియజేస్తోంది. రానున్న 12 నెలలకు ఉత్పత్తి అంచనాల పట్ల దేశీయ తయారీ కంపెనీలు ఆశావాదంతో ఉండడం గమనార్హం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top