భారీ మొత్తంలో లెనోవో ల్యాప్‌టాప్‌లు రీకాల్‌

Lenovo recalls 78,000 laptops over fire hazard - Sakshi

న్యూఢిల్లీ : పేలుళ్ల ఘటనలతో ఇన్నిరోజులు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజాగా ల్యాప్‌టాప్‌లు కూడా ఈ ఘటనల బారిన పడుతున్నాయి. పేలుళ్ల కారణాలతో చైనీస్‌ తయారీదారి లెనోవో భారీ మొత్తంలో ల్యాప్‌టాప్‌లను రీకాల్‌ చేసింది. థింక్‌ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌లను రీకాల్‌ చేసినట్టు లెనోవో ప్రకటించింది. 78వేల యూనిట్ల థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 కార్బన్‌ ఐదో జనరేషన్‌ ల్యాప్‌టాప్‌లను కంపెనీ రీకాల్‌ చేసినట్టు అమెరికాలోని కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ కూడా వెల్లడించింది. ఓవర్‌హీట్‌తో బ్యాటరీలు పాడైపోతున్నాయని తెలిపింది. దీంతో పేలుళ్ల ఘటనలు సంభవిస్తున్నాయని, వెంటనే ఈ బ్యాటరీలను రీఫైర్‌ చేయాల్సి ఉందని చెప్పింది. 

మొత్తం 78వేల యూనిట్ల రీకాల్‌లో 55,500 యూనిట్ల రీకాల్‌ కెనడాలోనే జరిగింది. లెనోవో థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 కార్బన్‌ ల్యాప్‌టాప్‌ ఐదవ జనరేషన్‌కు చెందింది. ఇది సిల్వర్‌, బ్లాక్‌ రంగుల్లో మార్కెట్‌లోకి వచ్చింది. రీకాల్‌ చేసిన ఈ 78వేల యూనిట్ల ల్యాప్‌టాప్‌లు 2016 డిసెంబర్‌ నుంచి 2017 డిసెంబర్‌ మధ్యలో తయారుచేశారు. థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 కార్బన్‌ 5వ తరం యూజర్లు వెంటనే https://support.lenovo.com/X1C_5GEN_RECALL లింక్‌ను క్లిక్‌ చేసి, తమ ల్యాప్‌టాప్‌లు రీకాల్‌ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలని కంపెనీ సూచించింది. ఒకవేళ ఈ జాబితాలో యూజర్ల ల్యాప్‌టాప్‌ ఉంటే, వెంటనే దాన్ని వాడటం ఆపివేయాలని హెచ్చరించింది. ఇటీవలే ముంబైలో వన్‌ప్లస్‌ 3టీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌ లో ఉండగా పేలింది. ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆ కంపెనీ అధికారికంగా స్పందించలేదు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top