
ప్రథమార్ధంలో 32.3 శాతం క్షీణత
మార్కెట్ లీడరుగా శాంసంగ్
ఐడీసీ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ 21.5 లక్షల యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 32.3 శాతం క్షీణించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రూపొందించిన వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ పర్సనల్ కంప్యూటింగ్ డివైజ్ ట్రాకర్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమ్మకాలు నెమ్మదించినప్పటికీ 41.3 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగగా, 12.3 శాతంతో లెనొవొ రెండో స్థానంలో నిల్చింది.
11.8 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడో స్థానంలో ఉంది. ‘‘భారత్‌లో ట్యాబ్లెట్ మార్కెట్ (డిటాచబుల్, స్లేట్ ట్యాబ్లెట్స్ కలిపి) 2025 ప్రథమార్ధంలో 21.5 లక్షల యూనిట్లుగా నమోదైంది. వార్షికంగా చూస్తే 32.3 శాతం తగ్గింది. 2025 రెండో త్రైమాసికంలో మార్కెట్ గణనీయంగా నెమ్మదించింది. వార్షిక ప్రాతిపదికన 42.1 శాతం క్షీణించింది. 2025 తొలి త్రైమాసికంలో 18.4 శాతం నెమ్మదించింది’’ అని ఐడీసీ నివేదిక తెలిపింది.
డిటాచబుల్ ట్యాబ్లెట్ సెగ్మెంట్ వార్షికంగా 18.9 శాతం పెరగ్గా, స్లేట్ ట్యాబ్లెట్ విభాగం గణనీయంగా 44.4 శాతం క్షీణించడంతో మొత్తం అమ్మకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కమర్షియల్ సెగ్మెంట్‌లో 47.9 శాతం, వినియోగదారుల సెగ్మెంట్‌లో 37.6 శాతం వాటాతో శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన విద్యా ప్రాజెక్టులతో పాటు ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా దూకుడుగా విక్రయ వ్యూహాలు అమలు చేయడం ఇందుకు తోడ్పడింది. 2025 రెండో త్రైమాసికంలోనూ 40.8 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ ఆధిపత్యం కొనసాగించింది.
యాపిల్‌కు కొత్త మోడల్స్ దన్ను
కమర్షియల్ సెగ్మెంట్‌లో ఇటు చిన్న, మధ్య తరహా సంస్థలతో పాటు అటు కంపెనీల విభాగంలోనూ లెనొవొ మెరుగ్గా రాణించింది. మొత్తం మార్కెట్లో 12.3 శాతం వాటా దక్కించుకుంది. ఇక 11.8 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడో స్థానంలో నిల్చిందని ఐడీసీ నివేదిక తెలిపింది. కన్జూమర్ సెగ్మెంట్‌లో యాపిల్ వాటా 14.4 శాతంగా నిల్చింది. కొత్త ఐప్యాడ్ మోడల్స్, విద్యార్థులకు డిస్కౌంట్ ప్రోగ్రాంలు ఇందుకు తోడ్పడ్డాయి. కమర్షియల్ సెగ్మెంట్లో కంపెనీ వాటా 7.3 శాతానికి పెరిగింది. అటు ఐడీసీ అంచనాల ప్రకారం షావోమీ, ఏసర్ మార్కెట్ వాటాలు వరుసగా 11.4 శాతం, 9.1 శాతంగా ఉన్నాయి. ట్యాబ్లెట్ పీసీ సెగ్మెంట్లో ఏసర్ అత్యధికంగా నష్టపోయింది. అమ్మకాలు 73 శాతం క్షీణించాయి.