అన్ని రకాల స్టాక్స్‌లో పెట్టుబడికి అవకాశం

Largecap mid and small cap invest in all types of stocks - Sakshi

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌

ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇలా అన్ని రకాల స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. అందుకు ఇది మల్టీక్యాప్‌ విభాగంలోకి వస్తుంది. దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు నిలకడగా ఉండడాన్ని గమనించొచ్చు. ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే బెంచ్‌ మార్క్‌ కంటే అధిక రాబడులను ఇచ్చింది. స్థిరమైన రాబడులు ఆశించే వారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ పథకాన్ని దీర్ఘకాలం ఇన్వెస్టింగ్‌ కోసం పరిశీలించొచ్చు.  

పనితీరు..
ఈ పథకం గడిచిన ఏడాది కాల పనితీరు ప్రామాణిక సూచీ కంటే మెరుగ్గా ఉంది. ఏడాది కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ పథకం నికరంగా నష్టాలనే ఇచ్చింది. మైనస్‌ 4.62శాతంగా ఉన్నాయి. 2018లో మార్కెట్ల పనితీరు నిరాశాజనకంగా ఉన్న విషయం గమనార్హం. కానీ, ఇదే కాలంలో ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా భావించే బీఎస్‌ఈ 500 రాబడులు కూడా మైనస్‌ 7.12 శాతంగా ఉండటం గమనార్హం. మూడేళ్ల కాలంలో అయితే, ఈ పథకంలో రాబడులు 13.27 శాతంగా ఉంటే, బీఎస్‌ఈ 500 రాబడులు 14.42 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో బీఎస్‌ఈ 500 రాబడులు 14.51 శాతం, పదేళ్ల కాలంలో 17.13 శాతంగా ఉండగా, ఈకాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ 16.51 శాతం, 18.45 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. దీర్ఘకాలంలో బీఎస్‌ఈ 500కు మించి రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే స్వల్ప కాలం కోసం కాకుండా ఐదేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం కోసం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.
 
పెట్టుబడుల తీరు 
ఈ పథకం తన పెట్టుబడుల్లో దాదాపు 95 శాతం నుంచి 100 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. అస్థిరతల సమయాల్లో నగదు నిల్వలు పెంచుకుంటుంది. 2015, 2016 సంవత్సరాల్లో బెంచ్‌ మార్క్‌లను మించి రాబడులను ఇవ్వగా, 2017లో మాత్రం వెనుకబడింది. సాఫ్ట్‌వేర్, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులే ఇందుకు కారణం. ఆ ఏడాదిలో ఈ రెండు రంగాల స్టాక్స్‌ ర్యాలీ చేయలేదు. 2018 జనవరి నుంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడం, ఈ స్టాక్స్‌ ర్యాలీ చేయడంతో ఈ పథకం ఎన్‌ఏవీ రికవరీ అయింది. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌కు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

వీటిల్లో సుమారు 34 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఇంధన రంగ స్టాక్స్‌లో సుమారు 19 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌ రంగాలకు సుమారు 9 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించడాన్ని గమనించొచ్చు. అతుల్‌ పటేల్, శంకరన్‌ నరేన్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార పరంగా అధిక నాణ్యత, వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ను ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేయడం చేస్తుంటారు. ముఖ్యంగా ఈక్విటీల్లో భారీ రిస్క్‌ వద్దనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top