కోటక్‌ ఖాతాలో యస్‌ బ్యాంక్‌! | Kotak Mahindra Bank Best Suited To Buy YES Bank | Sakshi
Sakshi News home page

కోటక్‌ ఖాతాలో యస్‌ బ్యాంక్‌!

Dec 18 2019 2:18 AM | Updated on Dec 18 2019 3:42 AM

Kotak Mahindra Bank Best Suited To Buy YES Bank - Sakshi

ముంబై: యస్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకోవడానికి కోటక్‌ మహీంద్రా బ్యాంకే కరెక్టని ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌లు  అభిప్రాయపడ్డారు. అయితే విలీన ప్రయత్నాలు లేవని యస్‌బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు స్పష్టం చేశాయి.  

కోటక్‌కే ఆ సత్తా...
యస్‌బ్యాంక్‌ను కొనుగోలు చేయగల సత్తా ఉదయ్‌ కోటక్‌కే ఉందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. యస్‌బ్యాంక్‌ను టేకోవర్‌ చేయడానికి భారీగా నిధులు అవసరమని, ఆ సత్తా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కే ఉందని వివరించారు. ఇక్కడ జరిగిన టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. కాగా ఇదే అభిప్రాయాన్ని యాక్సిస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ అమితాబ్‌ చౌధురి వ్యక్తం చేశారు. తమ బ్యాంక్‌  ఇప్పటికింకా చిన్నదేనని, పెద్ద బ్యాంక్‌గా వృద్ధి చెందే ప్రయత్నాలు చేస్తున్నామని, పెద్ద బ్యాంక్‌గా మారినప్పుడే ఇతర బ్యాంక్‌లను కొనుగోలు చేయగలమని ఆయన పేర్కొన్నారు.  

ఊసుపోని ఊహాగానాలు...
ఈ కొనుగోలు వార్తలు ఊసుపోని ఊహాగానాలని యస్‌ బ్యాంక్‌ చీఫ్‌ రవ్‌నీత్‌ గిల్‌ కొట్టిపడేశారు. విలీనప్రయత్నాలు ఏమీ లేవని తెగేసి చెప్పారు. కాగా విలీన వ్యాఖ్యలు ఆయా వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమేనని, తమకెలాంటి సంబంధం లేదని కోటక్‌ మహీంద్రా గ్రూప్‌ చీఫ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ రోహిత్‌ రావు పేర్కొన్నారు. యస్‌బ్యాంక్‌ చీఫ్‌గా రవ్‌నీత్‌ గిల్‌ పగ్గాలు చేపట్టి మొండి బకాయిల గుర్తిపు ప్రక్రియను మరింత వేగిరం చేశారు.   మరోవైపు నిధుల సమీకరణ ప్రయత్నాలు ఫలప్రదం కావడం లేదు. దీంతో ఈ బ్యాంక్‌ను చేజిక్కించుకోనే యత్నాలు ఊపందుకుంటున్నాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.  ఇక, పుష్కలమైన నిధులతో పటిష్టంగా ఉన్న కోటక్‌ బ్యాంక్‌... చిన్న బ్యాంక్‌లను  టేకోవర్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

బలమైన బ్యాంకులే నిలుస్తాయ్‌
బలమైన బ్యాంక్‌లే నిలబడగలుగుతాయని ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యానించారు. బలం ఉన్న జీవులే మనగలుగుతాయని చార్లెస్‌ డారి్వన్‌ పేర్కొన్నారని, ఈ సిద్ధాంతం ఇప్పుడు భారత్‌ బ్యాంకులకూ వర్తిస్తుందని వివరించారు. బలహీనమైన కంపెనీలను బలమైన కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయని, వివిధ రంగాల్లో విలీనాల జోరు పెరుగుతోందని పేర్కొన్నారు. సమస్యల్లో ఉన్న ప్రైవేట్‌ బ్యాంక్‌లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో విలీనమైన దృష్టాంతాలు గతంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement