
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో రూ.1,500 విలువగల 4జీ ఫీచర్ ఫోన్ల డెలివరీని ఆదివారం నుంచి ప్రారంభించనుంది. సంస్థ దాదాపు 60 లక్షల ఫోన్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
జియో ఫోన్ల ప్రి–బుకింగ్ ఆగస్ట్ 24న ప్రారంభమైన విషయం తెలిసిందే. రూ.500 ప్రారంభ డిపాజిట్‌తో కస్టమర్లు వీటికి బుకింగ్ చేసుకున్నారు. మిగిలిన మొత్తం ఫోన్ల డెలివరీ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు మూడేళ్ల తర్వాత ఫోన్‌ను వెనక్కు ఇవ్వడం ద్వారా ఈ పూర్తి మొత్తాన్ని తిరిగి పొందొచ్చు.