మ్యూచువల్‌ ఫండ్స్‌కే ఓటు!

Investors raised by a year 32 lakh - Sakshi

ఏడాదిలో పెరిగిన ఇన్వెస్టర్లు 32 లక్షలు

ఫలితాన్నిస్తున్న అవగాహన కార్యక్రమాలు

న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లతో సహా ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో రాబడులు తగ్గుతుండటంతో ఈక్విటీ మార్కెట్లవైపు మళ్లుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నేరుగా మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయటం కాస్తంత కష్టమైన వ్యవహారం కావటంతో అత్యధికులు మ్యూచువల్‌ ఫండ్లను ఆశ్రయిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఫండ్స్‌ ఇన్వెస్టర్ల సంఖ్య కొత్తగా 32 లక్షలు పెరిగింది. పరిశ్రమ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు కూడా దీనికి కారణమవుతున్నట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (యాంఫీ) చెబుతోంది. ‘‘మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు తొలిగా 2017 మార్చిలో ప్రతిష్టాత్మకంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సహి హై (మ్యూచువల్‌ ఫండ్స్‌ సరైనవి) ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించా. ఇపుడు మరో మీడియా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా దీర్ఘకాలంలో మరీ ముఖ్యంగా మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇన్వెస్టర్లకు తెలియజేస్తాం. తొలి విడత ప్రచార కార్యక్రమం దాదాపు 32 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లను ఫండ్లకు పరిచయం చేసింది. రెండో విడత ప్రచారం మరింత మందిని దగ్గర చేస్తుందని భావిస్తున్నాం’’ అని యాంఫీ తెలియజేసింది. 

50 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లే లక్ష్యం
వచ్చే ఏడాది కాలంలో 50 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లను ఫండ్లకు పరిచయం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు యాంఫీ తెలియజేసింది.  ‘కుటుంబాల ఆదాయం పెరిగింది. భారత్‌ దీర్ఘకాలిక వృద్ధి అంచనా నేపథ్యంలో ప్రజలు ఆర్థికంగా పొదుపు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రతి కుటుంబానికీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా మారతాయి’’ అని యాంఫీ చైర్మన్‌ ఎ.బాలసుబ్రమణ్యన్‌ చెప్పారు. ‘ఇన్వెస్టర్లకు సహనం కావాలి. ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తూ వెళ్లాలి. పోర్ట్‌ఫోలియోకు డెట్, హైబ్రిడ్‌ ఫండ్స్‌ను జతచేసుకోవాలి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌కు (సిప్‌) మరీ ముఖ్యంగా మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు అధిక ప్రాధాన్యమివ్వాలి. దీర్ఘకాలంలో లబ్ధి పొందేలా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి’ అని ఆయన వివరించారు. వచ్చే ఏడాది కాలంలో దేశ జనాభాలో 2 శాతం మందిని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేలా చూడడానికి తమకు ‘మ్యూచువల్‌ ఫండ్స్‌ సహి హై’ దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1.5 శాతం కన్నా తక్కువ మంది ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.  

ఏయూఎంలో 25 శాతం వృద్ధి 
మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల పెరుగుదలతో పాటు ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) కూడా వృద్ధి చెందాయి. 2017 మార్చి నుంచి చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఫండ్స్‌ ఏయూఎం విలువ 25 శాతం వృద్ధితో రూ.4.25 లక్షల కోట్లు పెరిగింది.  ‘మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో ఇటీవల గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కాపాడుకుంటూ రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తాం’ అని యాంఫీ సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు. ఫండ్స్‌లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేయండని తెలియజేసే ‘జన్‌ నివేశ్‌’ ప్రచార కార్యక్రమ ఆవిష్కరణకు ప్రముఖ మీడియా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఠీఠీఠీ.ఝu్టu్చ జunఛీటట్చజిజీ.ఛిౌఝ మైక్రోసైట్‌ను అందుబాటులో ఉంచిందని, ఇందులో  ఫండ్స్‌కు సంబంధించిన వివరాలను, సమీపంలోని ఫండ్‌ కార్యాలయం, మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్ల సమాచారాన్ని పొందొచ్చని తెలియజేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top