బలహీనంగా ఉన్నా... బలపడొచ్చు! | Sakshi
Sakshi News home page

బలహీనంగా ఉన్నా... బలపడొచ్చు!

Published Mon, Jun 18 2018 2:12 AM

Investors pick the wrong time to go big on gold - Sakshi

అంతర్జాతీయంగా న్యూయార్క్‌ కమోడిటీ ఎక్స్చేంజి– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 15వ తేదీతో ముగిసిన వారంలో 21 డాలర్లు తగ్గి, 1,282 డాలర్లకు చేరింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచిన నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ 1.25 శాతం ఎగిసి 93.55 నుంచి 94.80కి చేరడం దీనికి కారణమైంది. ఫెడ్‌ నిర్ణయంతో కీలక వడ్డీ రేట్లు ప్రస్తుతం 1.75–2.00 శాతానికి చేరాయి.

రేట్ల పెంపు ప్రభావంతో తక్షణం ఇన్వెస్టర్లు బంగారం నుంచి కొంత పెట్టుబడులను ఉపసంహరించారని భావించవచ్చు. దీనితో పసిడి 1,280 డాలర్ల కీలక మద్దతును టెస్ట్‌ చేసింది. అయితే బంగారం.. తక్షణం బలహీనంగా కనబడినప్పటికీ ఇది దీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. భౌగోళిక రాజకీయ, ఆర్థిక ఉద్రిక్త పరిస్తితులు.. ముఖ్యంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలను ఇందుకు కారణాలుగా ఉదహరిస్తున్నారు.

‘‘పసిడి ధరల దిగువ స్థాయిని స్వల్ప కాలికంగా మనం చూస్తే చూడవచ్చు. అయితే బంగారంలో భారీ అమ్మకాలు ఉంటాయని నేను భావించడం లేదు. గత వారం చోటు చేసుకున్న పరిణామాలతో పసిడి కొంత వెనక్కు తగ్గి ఉండవచ్చు. అయితే ఇప్పటికీ పటిష్ట స్థాయిలోనే ఉందని నేను విశ్వసిస్తున్నాను’’ అని లండన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌లో రిసెర్చ్‌ విభాగం హెడ్‌ జాస్పర్‌ లాలెర్‌ పేర్కొన్నారు.

వాణిజ్య యుద్ధ భయాలే పసిడికి రక్షణగా ఉంటాయన్న అభిప్రాయాన్ని కామర్జ్‌బ్యాంక్‌లో కమోడిటీ విశ్లేషణా విభాగం హెడ్‌ ఈజిన్‌ వెయిన్‌బర్గ్‌ కూడా వ్యక్తం చేస్తున్నారు. పసిడి ఈ ఏడాది మూడు సార్లు 1,360 డాలర్ల స్థాయిని తాకింది. మూడు వారాల   క్రితమే 1,300 డాలర్ల దిగువను చూసింది. తక్షణ నిరోధం 1,310 డాలర్లు. ఇది 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ కూడా కావడం గమనార్హం. ఇక  1,280–1,270 డాలర్ల శ్రేణి మద్దతును స్థాయిని కోల్పోతే, మరింత అమ్మకాల ఒత్తిడితో పసిడి 1,240 డాలర్ల వరకూ పడే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం.  

దేశీయంగా తగ్గింది అంతంతే...
అంతర్జాతీయంగా పసిడి ధర భారీగా పడినప్పటికీ, దేశీయంగా మాత్రం ఆ స్థాయిలో తగ్గలేదు. 15తో ముగిసిన వారంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా తగ్గడమే (దాదాపు రూపాయి పతనమై 68.47 వద్ద ముగింపు) దీనికి కారణం.

దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర వారంలో కేవలం రూ.205 తగ్గి, రూ.31,010కి చేరింది.  ఇక ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో  బంగారం ధర తగ్గకపోగా పెరిగింది. 99.9, 99.5 స్వచ్ఛత గల పసిడి ధరలు వారంలో రూ.90 చొప్పున లాభపడి  రూ.31,250, రూ.31,100 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.1,290 లాభపడి రూ.41.515 వద్దకు చేరింది.

Advertisement
 
Advertisement
 
Advertisement