
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా నాలుగో నెలా క్షీణించింది. 2019 నవంబర్‌లో వృద్ధి 1.5 శాతం తగ్గింది. 2018 నవంబర్‌లో ఈ ఎనిమిది పరిశ్రమలు 3.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. తాజాగా ఎనిమిదింట అయిదు పరిశ్రమలు ప్రతికూల వృద్ధి నమోదు చేయడంతో మొత్తం గ్రూప్ వృద్ధి మందగించింది. నవంబర్‌లో బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించింది. 2018 నవంబర్‌లో సిమెంటు ఉత్పత్తి వృద్ధి 8.8 శాతంగా ఉండగా.. 2019 నవంబర్‌లో 4.1 శాతానికి పరిమితమైంది. రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి 3.1 శాతం, ఎరువుల ఉత్పత్తి 13.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో మౌలిక పరిశ్రమలు అంతక్రితం ఏడాది ఇదే వ్యవధి స్థాయిలోనే 5.1 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇన్‌ఫ్రా గ్రూప్ వృద్ధి ఆగస్టు నుంచి మందగిస్తూనే ఉంది.