
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న పారిశ్రామికవేత్తలతో కలిసి తిరగడానికి తాను భయపడాల్సిన అవసరం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. వ్యాపారవర్గాలపై నెలకొన్న వ్యతిరేకతను తొలగించేందుకు ఇవి దోహదపడగలవని ఆశాభావం వ్యక్తం చేశాయి. ‘ఒకానొక దురదృష్టకర పార్శ్వం కారణంగా పరిశ్రమపై విముఖత పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని వ్యాఖ్యలు విశ్వాసాన్ని పెంపొందించేవిగా ఉన్నాయి‘ అని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘ఇటు పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తానని భరోసానిస్తూనే.. అటు దేశానికి, ఎకానమీకి హానిచేసే వ్యాపారవేత్తలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు. పరిశ్రమపై ప్రజలకు దురభిప్రాయాలేవైనా ఉంటే వాటిని తొలగించేందుకు, ప్రైవేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది‘ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ రశేష్ షా చెప్పారు. రైతులు, కార్మికులు, బ్యాంకర్లలాగే వ్యాపారవేత్తలు కూడా దేశాభివృద్ధికి తోడ్పడ్డారని, వారితో కలిసి కనిపించడానికి తానేమీ సంకోచించబోనని ఆదివారం లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.