‘ఇండిగో’లో ఇంటిపోరు!! | IndiGo promoters Rahul Bhatia, Rakesh Gangwal at loggerheads | Sakshi
Sakshi News home page

‘ఇండిగో’లో ఇంటిపోరు!!

May 17 2019 1:04 AM | Updated on May 17 2019 5:32 AM

IndiGo promoters Rahul Bhatia, Rakesh Gangwal at loggerheads - Sakshi

న్యూఢిల్లీ: ఒకదాని వెంట ఒకటిగా దేశీ విమానయాన సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రుణ సంక్షోభంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిల్చిపోగా.. తాజాగా చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు తెరపైకి వచ్చాయి. పనితీరు, వ్యాపార విస్తరణ వ్యూహాలపై వ్యవస్థాపకులు రాకేష్‌ గంగ్వాల్, రాహుల్‌ భాటియా మధ్య భేదాభిప్రాయాలు పొడచూపినట్లు సమాచారం. అయితే, గత కొద్ది వారాల్లో తీవ్రత మరింత పెరిగినప్పటికీ, పరిస్థితి లీగల్‌ కేసుల స్థాయిలో మాత్రం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

విభేదాల పరిష్కారం కోసం ఇరు వర్గాలు న్యాయ సలహా సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు వివరించాయి. లీగల్‌ సేవలందించే సంస్థలు ఖైతాన్‌ అండ్‌ కో, జే సాగర్‌ అండ్‌ అసోసియేట్స్‌ ఇందులో తోడ్పడుతున్నాయి. ఇద్దరూ కూడా ఈ సంస్థలకు పాత క్లయింట్లే కావడంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు రెండు సంస్థలూ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇండిగో కార్యకలాపాల విస్తరణ వ్యవహారం గందరగోళంగా మారే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ నిల్చిపోవడంతో చార్జీల ధరలకు రెక్కలు రాగా.. తాజాగా ఇండిగో వివాదం ముదిరితే దేశీ విమానయాన రంగంపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

దూకుడుగా గంగ్వాల్‌... ఆచితూచి భాటియా
2006లో భాటియా, గంగ్వాల్‌ కలిసి ఇండిగోను ఏర్పాటు చేశారు. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ పేరుతో దీని మాతృసంస్థ 2013లో స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. దేశీ ఏవియేషన్‌ మార్కెట్లో దీనికి 44 శాతం వాటా ఉంది. వ్యవస్థాపకుల్లో ఒకరైన గంగ్వాల్‌ విషయానికొస్తే.. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్, యూఎస్‌ ఎయిర్‌వేస్‌లో ఆయనకు సుదీర్ఘానుభవం ఉంది. దూకుడు వ్యూహాలతో ఇండిగోను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా నిలపడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులు, చేర్పులతో కంపెనీని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విస్తరణ ప్రణాళికల విషయంలో వేగంగా దూసుకుపోవాలన్నది గంగ్వాల్‌ అభిప్రాయం కాగా.. ఆచి తూచి అడుగేయాలని భాటియా భావిస్తారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రెండేళ్లుగా పలు సందర్భాల్లో ఇరువురి మధ్య విభేదాలు బైటపడ్డాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలో భాటియాకు 38, గంగ్వాల్‌కు 37 శాతం వాటాలున్నాయి.  

షేరు పతనం..
ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు గురువారం ఏకంగా 9 శాతం దాకా పతనమయ్యాయి. బీఎస్‌ఈలో 8.82 శాతం నష్టంతో రూ.1,466.60 వద్ద క్లోజయ్యాయి. ఒక దశలో 9.82 శాతం నష్టంతో రూ. 1,450.50కి కూడా షేరు తగ్గింది. అటు ఎన్‌ఎస్‌ఈలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు 8.40 శాతం తగ్గి రూ. 1,475 వద్ద ముగిసింది. షేరు ధర గణనీయంగా క్షీణించడంతో కంపెనీ మార్కెట్‌ వేల్యుయేషన్‌ ఏకంగా రూ.5,456 కోట్లు తగ్గి రూ. 56,377 కోట్లకు పరిమితమైంది. బీఎస్‌ఈలో 3.70 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 70 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తలపై వివరణనివ్వాలంటూ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌కు బీఎస్‌ఈ సూచించింది.   

ప్రణాళికలు యథాతథం: సీఈవో
ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఉద్యోగులకు భరోసానిచ్చే క్రమంలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సీఈవో రొణొజొయ్‌ దత్తా తమ సిబ్బందికి ఈమెయిల్‌ పంపారు. కంపెనీ వృద్ధి వ్యూహాలు యథాతథంగానే ఉన్నాయని, వీటి అమలుకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నుంచి మేనేజ్‌మెంట్‌కు పూర్తి మద్దతుందని ఆయన పేర్కొన్నారు. ‘మన ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌ మధ్య విభేదాలు తలెత్తాయన్న ఆరోపణల వార్తల గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే, సంస్థ వృద్ధి వ్యూహాల్లో ఎటువంటి మార్పు లేదని మీకు భరోసా ఇవ్వదల్చుకున్నాను. ప్రణాళికలను అమలు చేయడానికి మేనేజ్‌మెంట్‌కు బోర్డు నుంచి పూర్తి మద్దతు కూడా ఉంది‘ అని ఈమెయిల్‌లో దత్తా పేర్కొన్నారు. వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగులతో పాటు సంస్థతో అనుబంధం ఉన్న వారందరికీ ప్రయోజనం చేకూర్చడంపైనే ఇకపైనా దృష్టి పెడతామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement