టోకు ద్రవ్యోల్బణం ‘యూ’ టర్న్... | Sakshi
Sakshi News home page

టోకు ద్రవ్యోల్బణం ‘యూ’ టర్న్...

Published Tue, May 17 2016 1:39 AM

టోకు ద్రవ్యోల్బణం ‘యూ’ టర్న్...

* 1- 17 నెలల తరువాత క్షీణతలో నుంచి బయటకు..
* ఏప్రిల్‌లో 0.34 శాతం
* తయారీ రంగం ‘ప్లస్’ ఎఫెక్ట్..
* కొన్ని నిత్యావసరాల ధరలు పైకి..

న్యూఢిల్లీ: తయారీ రంగం అలాగే కొన్ని ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల ఫలితంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం క్షీణదశ నుంచి పెరుగుదల బాటలోకి ‘యూ’ టర్న్ తీసుకుంది. ఏప్రిల్‌లో 0.34 శాతం రేటు నమోదయ్యింది. అంటే సూచీ 2015 ఏప్రిల్‌తో పోల్చితే 2016 ఏప్రిల్‌లో 0.34 శాతం పెరిగిందన్నమాట.  

క్రూడ్ ఉత్పత్తుల ధరలు దిగువ స్థాయిలో ఉండడం, సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న తయారీ రంగం మందగమనం వంటి అంశాల నేపథ్యంలో గడచిన 17 నెలల్లో వార్షికంగా ఏ నెలలోనూ పెరుగుదల నమోదుచేసుకోలేదు. మైనస్‌లోనే వుంటూ వచ్చింది. 2015 ఏప్రిల్‌లో ఈ రేటు -2.43 శాతం. ఇటీవల విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 6%కి దగ్గరకు చేరింది. తాజా గణాంకాల నేపథ్యంలో... జూన్ 7 పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ రేటు కోత అనుమానమేనని నిపుణులు కొందరు విశ్లేషిస్తున్నారు.
 
కొన్ని నిత్యావసరాలు చూస్తే...
పప్పులు (36%), ఆలూ (35%), చక్కెర (16%) ధరలు పెరిగిన వస్తువుల జాబితాలో ఉన్నాయి.కూరగాయల ధరలు 2.21% ఎగశాయి.   ఉల్లి ధరలు మాత్రం 5% తగ్గాయి. పండ్ల ధరలు -2.38% తగ్గాయి. ఫుడ్ ఆర్టికల్స్, నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ సూచీ 0.50 శాతం నుంచి 2.34 శాతానికి ఎగసింది. ఇందులో ఫుడ్ ఆర్టికల్స్ రేటు 5.90% నుంచి 4.23%కి తగ్గింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌కు సంబంధించి రేటు -2.9 శాతం క్షీణ దశ నుంచి 7.12 శాతం పెరుగుదల బాటకు మారింది.

Advertisement
Advertisement