ఈ ఏడాది వృద్ధి రేటు 5.4% | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది వృద్ధి రేటు 5.4%

Published Wed, Apr 9 2014 1:06 AM

India's GDP growth likely to rise to 5.4% in 2014: IMF

 వాషింగ్టన్: గతేడాది 4.4 శాతంగా ఉన్న భారత ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 5.4 శాతానికి చేరే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్)తెలిపింది. ప్రపంచ వృద్ధి స్వల్పంగా బలపడడం, ఎగుమతుల సామర్థ్యం పుంజుకోవడం, ఇటీవల ఆమోదించిన పెట్టుబడుల ప్రాజెక్టులను అమలు చేయడం అభివృద్ధి రేటు పెరగడానికి దోహదపడతాయని పేర్కొంది. ‘ఇటీవలి నెలల్లో భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి.

పసిడి దిగుమతులపై ఆంక్షల ఫలితంగా కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) తగ్గింది. వినియోగ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా తిరోగమనం పట్టవచ్చు గానీ, అదో ముఖ్యమైన సవాలుగానే కొనసాగవచ్చు. 2015లో భారత్ 6.4 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశముంది. అయితే, ఇందుకు పెట్టుబడులు పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సఫలం కావాలి, ఎగుమతులు మరింత వృద్ధి చెందాలి. ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంపాటు తక్కువ స్థాయిలో ఉంచడానికి భారత ప్రభుత్వం మరింత కఠినమైన ద్రవ్య విధానాలను అవలంబించాల్సి ఉంది...’ అని ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై విడుదల చేసిన తాజా నివేదికలో ఐఎంఎఫ్ తెలిపింది.

 పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు ద్రవ్య విధాన రూపకర్తలు నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారించాలని ఐఎంఎఫ్ సూచించింది. సహజ వనరులకు మార్కెట్ ఆధారిత ధరలను నిర్ణయించాలనీ, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల అమల్లో జా ప్యాన్ని తొలగించాలనీ పేర్కొంది. విద్యుత్తు, గనుల రంగాల్లో విధానాలను మెరుగుపర్చాలని కోరింది.

 భారత్ వృద్ధి బలహీనమే: ఓఈసీడీ
 కాగా, భారత్ వృద్ధి బలహీన ధోరణిని సూచిస్తోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు  నిర్వహిస్తున్న 33 దేశాల ఆర్థిక విశ్లేషణా సంస్థ- ఓఈసీడీ (ఎకనమిక్ కో-ఆపరేటివ్ అండ్ డెవలప్‌మెంట్) పేర్కొంది. దీనిప్రకారం జనవరిలో 97.7 పాయింట్లుగా ఉన్న ఓఈసీడీ కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్ (సీఎల్‌ఐ) సూచీ ఫిబ్రవరిలో 97.6కు తగ్గింది. నవంబర్‌లో ఈ రేటు 97.9. డిసెంబర్‌లో 97.8గా ఉంది. భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యాలు సైతం ఆర్థికంగా బలహీనతలోనే ఉన్నాయి. చైనా పరిస్థితి మాత్రం కొంత మెరుగుపడింది.

Advertisement
Advertisement