త్వరలో పీసీఏ నుంచి బైటపడతాం

Indian Overseas Bank aims to exit PCA soon - Sakshi

మొండిబాకీల రికవరీపై కసరత్తు

ఎంఎస్‌ఎంఈ, రిటైల్‌ రుణాలపై మరింత దృష్టి పెడుతున్నాం...

ఐవోబీ ఎండీ కరణం శేఖర్‌

మొండిబాకీల రికవరీకి, నిర్వహణ మెరుగుపర్చుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టగలమని ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐవోబీ) ఎండీ, సీఈవో కరణం శేఖర్‌ తెలిపారు. తద్వారా సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)పరమైన ఆంక్షల పరిధి నుంచి త్వరలోనే బైటపడగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాక్షి బిజినెస్‌ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్‌ ఈ విషయాలు వెల్లడించారు. మరిన్ని వివరాలు..  
 

పీసీఏ నుంచి ఎలా బైటపడబోతున్నారు?
ఐవోబీ 2015లో పీసీఏ పరిధిలోకి వచ్చింది. మొండిబాకీలు పేరుకుపోయిన బ్యాంకులపై పీసీఏపరమైన ఆంక్షలు విధించేందుకు ఆర్‌బీఐ ప్రధానంగా నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వీటిలో లీవరేజీ అంశంలో మేం మెరుగ్గానే ఉన్నాం. మూలధన నిష్పత్తి విషయంలో సెప్టెంబర్‌ త్రైమాసికంలో గట్టెక్కాం. మొండిబాకీలు కూడా నిర్దేశిత 6 శాతం దిగువకి తగ్గనున్నాయి. ప్రొవిజనింగ్‌ క్రమంగా తగ్గుతుండటంతో డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనే మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశముంది.  

మొండిబాకీల రికవరీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
మొండిబాకీలను (ఎన్‌పీఏ) రాబట్టుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. అన్ని ఎన్‌పీఏలను 16 అసెట్‌ రికవరీ మేనేజ్‌మెంట్‌ శాఖలకు (ఏఆర్‌ఎంబీ) బదలాయిస్తున్నాం. రికవరీ బాధ్యతలను వాటికే అప్పగిస్తున్నాం. ప్రత్యేక వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ స్కీమ్‌ (ఓటీఎస్‌) కింద రూ. 25 కోట్ల దాకా రుణాల సెటిల్మెంట్‌కు అవకాశం కల్పిస్తున్నాం. దీన్నుంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటి ఊతంతో నికర ఎన్‌పీఏలు 6 శాతం లోపు స్థాయికి దిగి రావొచ్చు. మొండిబాకీల పరిమాణం తగ్గే కొద్దీ ప్రొవిజనింగ్‌ కూడా క్రమంగా తగ్గనుంది. తద్వారా మళ్లీ స్థిరంగా లాభాలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.  మరోవైపు, డిఫాల్టర్ల ప్రాపర్టీల వేలం ప్రక్రియ కూడా చురుగ్గా నిర్వహిస్తున్నాం. ఇలాంటివి సుమారు 8,000 దాకా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రతి నెలా 1,000–1,500 దాకా వేలం నిర్వహిస్తున్నాం. గతేడాది జూలైలో ప్రారంభమైన తొలి విడత ఈ జనవరిలో పూర్తి కానుంది. దీనికి క్రమంగా మంచి స్పందనే వస్తోంది.  

రుణాల పోర్ట్‌ఫోలియో పరిస్థితి ఎలా ఉంది?
మేం ఎక్కువగా కార్పొరేట్‌ రుణాల జోలికి వెళ్లడం లేదు. ప్రధానంగా లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ), రిటైల్‌ గృహ రుణాలు, వ్యవసాయ రుణాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. ఎంఎస్‌ఎంఈ రుణాల పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 30,000–35,000 కోట్ల స్థాయిలో ఉంది. దీనితో పాటు రిటైల్, వ్యవసాయ రుణాలన్నీ కలిపి రూ. 1 లక్ష కోట్ల పైగానే ఉంటాయి. ఎంఎస్‌ఎంఈ రుణాలకు సంబంధించి ప్రత్యేకంగా 200 శాఖలను గుర్తించాం. వీటిలో 20 శాఖలు తెలుగు రాష్ట్రాల్లో ఉండనున్నాయి. ఎంఎస్‌ఎంఈల రుణావసరాలు తదితర అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఈ శాఖల్లో ఉంటారు. జనవరి–మార్చి త్రైమాసికంలోనే ఈ వ్యూహాన్ని అమల్లోకి తేనున్నాం.  ఎంఎస్‌ఎంఈ, రిటైల్‌ రుణాల్లో పెద్దగా మొండిబాకీల సమస్య లేదు. నికర వడ్డీ మార్జిన్లు మెరుగ్గా ఉంటాయి.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top