Sakshi News home page

నాగార్జునా ఆయిల్ లో వాటా కొంటున్న ఐఓసీ?

Published Fri, Apr 8 2016 12:30 AM

నాగార్జునా ఆయిల్ లో వాటా కొంటున్న ఐఓసీ?

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాగార్జునా గ్రూప్‌నకు చెందిన నాగార్జునా ఆయిల్ కార్పొరేషన్ (ఎన్‌ఓసీఎల్)లో వాటా కొనుగోలుచేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తమిళనాడులోని కడ్డలూర్‌లో ఎన్‌ఓసీఎల్ 60 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఒక రిఫైనరీని నెలకొల్పుతోంది. దేశంలో మిగులు రిఫైనరీ ఉత్పాదక సామర్థ్యం వుందన్న కారణంతో 2002లో ఈ నాగార్జునా గ్రూప్ కంపెనీలో వాటా తీసుకునేందుకు ఐఓసీ విముఖత చూపింది. అయితే తాజాగా వాటా కొనుగోలుకు ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది.

సంవత్సరాలు గడిచినా....
రూ. 25,000 కోట్ల పెట్టుబడి వ్యయంతో తొలిదశలో 60 లక్షల టన్నుల రిఫైనరీని ఏర్పాటుచేసి, మలిదశలో సామర్థ్యాన్ని 120 లక్షల టన్నులకు పెంచాలన్న ప్రణాళికతో రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టును నాగార్జునా గ్రూప్ మొదలుపెట్టింది. అప్పటి నుంచీ ఈ ప్రాజెక్టును ఆర్థిక సమస్యలు వెంటాడటంతో రిఫైనరీ పూర్తికాలేదు. కొద్ది సంవత్సరాల క్రితం తీవ్ర తుపాను కారణంగా ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగడం, అటుతర్వాత ప్రపంచవ్యాప్త సంక్షోభంతో నిధుల కొరత వంటివాటితో రిఫైనరీ పట్టాలకెక్కలేదు. ఈ ప్రాజెక్టును రూ. 3,600 కోట్లకు కొనుగోలుచేసేందుకు సింగపూర్‌కు చెందిన నెట్‌ఆయిల్ చర్చలు జరిపినప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ చర్చలు విఫలమయ్యాయి. కాగా, తాజా వార్తలతో కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో 20 శాతం ఎగబాకి రూ.4.30 వద్ద ముగిసింది.

Advertisement

What’s your opinion

Advertisement