3 టైర్లు పంక్చరైన కారు.. మన ఆర్థికవ్యవస్థ

Indian Economy Like A Car With 3 Tyres Punctured : P Chidambaram - Sakshi

థానే : వినియోగదారులకు వాత పెడుతున్న పెట్రోల్‌ ధరలు, ఇతర సమస్యలపై మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ మూడు టైర్లు పంక్చరైన కారు లాగా ఉందన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ యూనిట్‌ థానేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ‘ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ ఖర్చులు భారత ఆర్ధిక వ్యవస్థకు నాలుగు ఇంజిన్ల లాంటివి. ఇవి ఓ కారుకు నాలుగు టైర్లు లాంటివి. ఒకవేళ ఒకటి, రెండు టైర్లు పంక్చర్ అయితేనే వేగం తగ్గిపోతుంది. కానీ మన ఆర్ధిక వ్యవస్థ విషయంలో మూడు టైర్లకు పంక్చర్ అయింది’ అని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అన్నారు. ప్రభుత్వం ఖర్చులు కేవలం ఆరోగ్య సంరక్షణ, కొన్ని ఇతర సదుపాయాల్లో మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ ఖర్చులు కొనసాగించేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్‌ పైనా పన్నుల భారం వేసిందన్నారు. ప్రజల నుంచి భారీ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం, ప్రజా సౌకర్యాల కోసం కొద్ది మొత్తంలోనే ఖర్చుపెడుతుందన్నారు. 

ఇటీవల కాలంలో విద్యుత్‌ రంగంలో ఏమైనా కేంద్రం ఖర్చు చేయడం చూశారా? అంటూ చిదంబంర ప్రశ్నించారు. 10 దిగ్గజ కంపెనీలు దివాలా తీస్తే, వాటిలో ఐదు స్టీల్‌ కంపెనీలే ఉన్నాయని, దీంతో ఆ రంగాల్లో పెట్టుబడులు ఎలా ఆశిస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేసిన ఐదు శ్లాబుల జీఎస్టీ పాలనను కూడా చిదంబరం విమర్శించారు. ఈ ఐదు శ్లాబులకు తోడు సెస్ వసూలు చేయడం పైనా చిదంబరం విమర్శలు సంధించారు. మిగతా దేశాల్లో జీఎస్టీ కింద ఒకే పన్ను వ్యవస్థ ఉంటుందనీ.. కానీ భారత్‌లో మాత్రం రెండు రకాల పన్నుల వ్యవస్థ అమలు చేస్తున్నారన్నారు. ఆర్థిక సమస్యలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఉందని చెప్పారు.  ప్రధానమంత్రి ముద్ర యోజన కింద మోదీ ప్రభుత్వం నాన్‌ కార్పొరేట్‌, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల రుణం ఇస్తుందని, సరాసరిన ఓ వ్యక్తికి ముద్ర రుణం కింద దక్కేది రూ.43 వేలు మాత్రమే. ఈ తక్కువ మొత్తంతో పకోడా స్టాల్ పెట్టుకోవడం తప్ప.. ఏ పెట్టుబడి పనికి రాదు’ అని చిదంబరం అన్నారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top