హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌- అరబిందో జోరు

HDFC Life- Aurobindo pharma jumps - Sakshi

మాతృ సంస్థ వాటా విక్రయ ఎఫెక్ట్‌

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేరు 4% అప్‌

అరబిందో- క్యూ4 ఫలితాల దన్ను

52 వారాల గరిష్టానికి షేరు

ఆటుపోట్ల మధ్య వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఉదయం 10.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 69 పాయింట్లు పుంజుకుని 34,179కు చేరగా.. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 10,081 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న సానుకూల వార్తల కారణంగా ప్రయివేట్‌ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ అరబిందో ఫార్మా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ 1.28 శాతం ఈక్విటీ వాటాను విక్రయించిన వార్తలతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌంటర్‌ బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 520 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 524 వరకూ ఎగసింది. గత రెండు వారాలలో ఈ కౌంటర్‌ 9 శాతం పుంజుకోవడం గమనార్హం! షేరుకి రూ. 490.22 ధరలో హెచ్‌డీఎఫ్‌సీ బల్క్‌డీల్‌ ద్వారా 2.6 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఈక్విటీ షేర్లను విక్రయించింది. వీటి విలువ దాదాపు రూ. 1275 కోట్లు. కాగా.. భాగస్వామ్య సంస్థ స్టాండర్డ్‌ లైఫ్‌ సైతం హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 2 శాతం వాటాను విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

అరబిందో ఫార్మా
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అరబిందో ఫార్మా నికర లాభం 45 శాతం ఎగసి రూ. 850 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 6158 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో అరబిందో కౌంటర్‌కు న్యూట్రల్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు విదేశీ రీసెర్చ్‌ సంస్థ క్రెడిట్‌ స్వీస్ పేర్కొంది. రూ. 665 టార్గెట్‌ను ప్రకటించింది. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అరబిందో షేరు 2.7 శాతం లాభపడి రూ. 770 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 791 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. క్యూ4లో అరబిందో మంచి పనితీరును చూపినట్లు క్రెడిట్‌ స్వీస్‌ తెలియజేసింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన అమెరికాలో ఇంజక్టబుల్స్‌ అమ్మకాలు 23 శాతం క్షీణించినట్లు తెలియజేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top