ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉంటే...

Having More Than One PAN Card Attracts Rs. 10000 As Fine - Sakshi

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఈ నెల ఆఖరి తేదీనే తుది గడువు. ఒకవేళ ఇప్పటికీ పాన్‌ కార్డు లేకపోతే.. ఆదాయపు పన్ను రిటర్నులను(ఐటీఆర్‌) దాఖలు చేయడానికి వీలులేదు. ఐటీఆర్ ఫైల్‌ చేయడానికి కచ్చితంగా పాన్‌ కార్డు కావాల్సిందేనని ఆదాయపు పన్ను అథారిటీ చెప్పింది. ఈ నేపథ్యంలో పాన్‌ కార్డు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం...

పాన్‌ కార్డు అంటే..  
పాన్‌ కార్డు అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్య. దీన్ని ఆదాయపు పన్ను శాఖ  ల్యామినేటెడ్‌ రూపంలో జారీ చేస్తుంది. పాన్‌ కార్డు కలిగి ఉన్న వ్యక్తి అన్ని లావాదేవాలు డిపార్ట్‌మెంట్‌తో లింక్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ లావాదేవీల్లో పన్ను చెల్లింపులు, ఆదాయం/సంపద/బహుమతుల రిటర్నులు వంటివన్నీ ఉంటాయి. 

పాన్‌ కార్డు వాలిడిటీ...
ఒక్కసారి పాన్‌ కార్డు పొందితే, అది జీవితకాలం వాలిడిటీలో ఉంటుంది. దేశవ్యాప్తంగా వాలిడ్‌లో ఉంటుంది. ఒకవేళ అడ్రస్‌ మారినా.. లేదా ఆఫీసు మారినా దీనిపై ఎలాంటి ప్రభావం ఉండదు. పాన్‌ డేటాబేస్‌లో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే అంటే పాన్‌ దరఖాస్తు చేసుకునే సమయంలో అందించిన వివరాల్లో ఏమైనా మార్చాల్సి ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో తెలపాలి.

ఒక్క పాన్‌ కార్డు కంటే ఎక్కువ ఉండొచ్చా..?
ఒక వ్యక్తి ఒక్క పాన్‌ కార్డు కంటే ఎక్కువ కలిగి ఉండకూడదు. మరో పాన్‌ కోసం దరఖాస్తు కూడా చేసుకోకూడదు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు కలిగి ఉంటే, ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్‌ 272బీ కింద 10వేల రూపాయల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు జారీ చేస్తే.. వాటిని వెంటనే ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఒక్క శాశ్వత ఖాతా సంఖ్యనే వారి వద్ద ఉంచుకోవాలి.

ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఎందుకుంటాయి..?
వివిధ సందర్భాల్లో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉండే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో సరైన అవగాహన లేక ఇలా జరుగుతూ ఉంటుంది. పాన్‌ కార్డులో మార్పులు చేసుకోవాలనుకునేవారు, అలా మార్పులు చేసుకోకుండా.. కొత్త దాని కోసం దరఖాస్తు చేస్తారు. ఇలా ఒక వ్యక్తి దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉండే అవకాశాలుంటాయి. పెళ్లయిన యువతలు ఇంటి పేరు మార్పుతో కొత్త పాన్‌కు దరఖాస్తు చేస్తారు. ఇలా కూడా రెండు ఉండొచ్చు. లేని వ్యక్తుల పేరుతోనో, నకిలీ పేర్లతోనే ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు పొందిన వారు లేకపోలేదు. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు పొందే వారిపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం జరిమానా విధిస్తుంది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top