హల్వా తయారీతో బడ్జెట్‌ ముద్రణకు శ్రీకారం

Halwa Ceremony Held At Finance Ministry Ahead Union Budget - Sakshi

న్యూఢిల్లీ : సం‍ప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’  తయారీతో 2019 -20 కేంద్ర బడ్జెట్‌ పత్రాల ముద్రణా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరంతా ‘బడ్జెట్‌ హల్వా’ రుచి చూసి బడ్జెట్‌ పత్రాల ముద్రణ కార్యక్రమాన్ని ఆరంభించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 2.0 క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారిగా ఆమె జూలై 5న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌ హల్వా తయారీతో ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టారు.


కాగా హల్వా కార్యక్రమం అనంతరం ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ.. బడ్జెట్‌ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ-మెయిల్‌తోగానీ మరే ఇతర మాధ్యమాల ద్వారా మాట్లాడే వీలుండదు. నార్త్‌ బ్లాక్‌ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్‌ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది.  

అత్యంత గోప్యంగా ముద్రణ
ఎంతో పకడ్బందీగా తయారయ్యే  బడ్జెట్‌ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను  కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్‌ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్‌ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్‌ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్‌ కింద ఉండే బడ్జెట్‌ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్‌ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్ఛ్సేంజీని ఏర్పాటు చేస్తారు. అంతేకాక మొబైల్‌ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్‌ చేస్తారు.  అలాగే ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేస్తారు. మధ్య మధ్యలో  ‘మాక్‌ డ్రిల్‌’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top