గూగుల్‌ మ్యాప్స్‌లో ఆటో రిక్షా రూట్లు

Google Maps to show auto-rickshaw routes, estimated fares for Delhi commuters - Sakshi

చార్జీల వివరాలు కూడా

ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అమలు

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ తాజాగా  మ్యాప్స్‌ యాప్‌లో ఆటో రిక్షా రూట్లను కూడా పొందుపర్చింది. ఏయే ప్రాంతాలకు ఆటోల్లో ప్రయాణించేందుకు ఎంతెంత చార్జీలవుతాయన్నది ఇది ఉజ్జాయింపుగా చూపిస్తుంది. ఆయా రూట్లలో ఆటో చార్జీలపై ప్రయాణికులు ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ఫీచర్‌ తోడ్పడగలదని గూగుల్‌ మ్యాప్స్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ విశాల్‌ దత్తా తెలిపారు. దీన్ని సోమవారం నుంచి ముందుగా ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారాయన. ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ నుంచి సేకరించిన చార్జీల పట్టిక ఆధారంగా మ్యాప్స్‌ యాప్‌లో చార్జీలను పొందుపర్చినట్లు పేర్కొన్నారు. ‘‘ఎక్కువగా వినియోగించే ప్రజా రవాణా సాధనాలను మ్యాప్స్‌లో అందుబాటులో ఉంచాలన్నది మా ఉద్దేశం. చాలా మందికి తాము వెళ్లే ప్రదేశం ఎంత దూరంలో ఉంది, మెరుగైన రూట్‌ ఏది, ఏయే రవాణా సాధనంలో చార్జీలు ఎంతెంత అవుతాయన్నది అంతగా తెలియదు. ఇలాంటి వారికి ఆటో, బస్సు లేదా మెట్రో మొదలైన వాటిల్లో దేని ద్వారా త్వరితగతిన, తక్కువ చార్జీలతో గమ్యస్థానాలకు చేరుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది’’ అని దత్తా వివరించారు.

బిలియన్‌ డాలర్లతో గూగుల్‌ కొత్త క్యాంపస్‌
న్యూయార్క్‌ సిటీలో దాదాపు బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో కొత్త క్యాంపస్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ వెల్లడించింది. గూగుల్‌ హడ్సన్‌ స్క్వేర్‌గా వ్యవహరించే ఈ క్యాంపస్‌ 2020 నాటికి అందుబాటులోకి రాగలదని, ఆ తరువాతి పదేళ్లలో న్యూయార్క్‌ సిటీలోని తమ ఉద్యోగుల సంఖ్య రెట్టింపై 14,000కు చేరగలదని వివరించింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top