మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌లో మంచి అవకాశాలు

Good Oprtunities in Mid Cap And Small Cap - Sakshi

దిద్దుబాటుకు గురైన షేర్లు త్వరలో ర్యాలీ

రానున్న 12 నెలల్లో మంచి పనితనం ప్రదర్శించే అవకాశం

ఎన్‌డీఏకు స్పష్టమైన విజయాన్ని ఇవ్వడంతో ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌ నెలకొంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడులకు ఇది మంచి అనుకూల సమయం. వృద్ధిని పునరుద్ధరించేందుకు నూతన ప్రభుత్వం బలమైన విధానపర చర్యల్ని చేపట్టే అవకాశం ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్‌ రెండు రకాల పరిస్థితుల్లో మంచి పనితీరు చూపిస్తాయి. మార్కెట్లు రిస్కీగా ఉన్నా,  ఒక్కో సందర్భంలో ఇవి మంచి ప్రదర్శన చూపుతాయి. సెన్సెక్స్‌తో పోలిస్తే వ్యాల్యూషన్లు సౌకర్యంగా ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. సెన్సెక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 12 శాతం ప్రీమియంతోనూ గతంలో ట్రేడయింది. ఇప్పుడు మిడ్‌క్యాప్‌ సూచీ తక్కువలో ఉందంటే, భవిష్యత్తులో వేగవంతమైన పనితీరు చూపించే అవకాశం ఉంటుందని అర్థం. రిస్కీ స్థాయికి వెళ్లిన తర్వాత మిడ్‌క్యాప్స్, స్మాల్‌క్యాప్స్‌లో దిద్దుబాటు జరగడం వల్లే ప్రస్తుతం తక్కువ వ్యాల్యూషన్లకు వచ్చాయి.

ఎన్నికల నేపథ్యంలో అనిశ్చితి...
ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ సూచీ సెన్సెక్స్‌ కంటే 10 శాతం డిస్కౌంట్‌లో ఉంది. ఎన్నికల నేపథ్యం మార్కెట్లలో రిస్క్‌ను పెంచింది. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ తక్కువ విలువల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ తరహా పరిస్థితులు... దిద్దుబాటుకు గురైన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ర్యాలీ చేస్తాయని సూచిస్తున్నాయి. వచ్చే 12 నెలల్లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ మంచి పనితీరు చూపిస్తాయని మేం భావిస్తున్నాం.  మిడ్‌క్యాప్‌ ఈక్విటీ ఫండ్స్‌ పథకాలు ప్రధానంగా మిడ్‌క్యాప్‌ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. సెబీ నిర్వచనం ప్రకారం... మార్కెట్‌ విలువ పరంగా 101 నుంచి 250 వరకు స్థానాల్లో ఉన్నవి మిడ్‌క్యాప్‌. మిడ్‌క్యాప్‌ పథకాలు వాటి పోర్ట్‌ఫోలియోలో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. రూ.8,500 కోట్లకుపైగా మార్కెట్‌ క్యాప్‌ కలిగిన కంపెనీలు 150 వరకు ఉన్నాయి. మరో 35 శాతాన్ని మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే సౌకర్యాన్ని ఈ పథకాలు కలిగి ఉంటాయి.

హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్‌...
హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకం. 12 ఏళ్ల బలమైన ట్రాక్‌ రికార్డు కలిగి ఉంది. దీర్ఘకాలంలో సంపద సృష్టించాలన్న లక్ష్యాన్ని ఈ పథకం రుజువు చేసి చూపించింది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి వార్షికంగా 15 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌– 100 సూచి రాబడులు 11 శాతంగానే ఉన్నాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈ పథకం గొప్ప పనితీరుతో ముందున్నది. ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి ప్రతీ నెలా రూ.10,000 సిప్‌ చేస్తూ వస్తే ఇప్పటికి రూ.14.40 లక్షల పెట్టుబడి రూ.45.42 లక్షలుగా వృద్ది చెందేది. తగినంత వృద్ధి అవకాశాలు, బలమైన ఆర్థిక సామర్థ్యం (రిటర్న్‌ రేషియో, క్యాష్‌ఫ్లో), స్థిరమైన, అర్థం చేసుకోతగిన వ్యాపార నమూనాలు, ఆమోదనీయమైన వ్యాల్యూషన్  అంశాల ఆధారంగా స్టాక్స్‌ ఎంపిక  చేసుకుంటుంది. 

బలమైన పనితీరు చరిత్ర, తగినంత వైవిధ్యం, అనుభవంతో కూడిన నిర్వహణ బృందంతో కూడిన హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ అపార్చునిటీస్‌ ఫండ్, మిడ్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి ఆప్షన్  అవుతుంది. ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈ పథకంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు సిప్‌ మార్గాన్ని ఎంచుకోవచ్చు. అధిక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకు మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ సూచించడం జరుగుతుంది. కనుక అధిక రిస్క్‌ తీసుకుని, అధిక రాబడులు కోరుకునే వారు ఈ తరహా పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top