బంగారం 1,530 డాలర్ల పైన... ర్యాలీయే

Gold futures retreat on stronger US dollar - Sakshi

అమెరికా ఉద్యోగ గణాంకాలు, పావెల్‌ వ్యాఖ్యలు కీలకం

బంగారం గత మంగళవారం ఆరున్నరేళ్ల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత వారం మొత్తం మీద ఆర్జించిన లాభాలను కోల్పోయింది. డిసెంబర్‌ కామెక్స్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 0.3 శాతం నష్టపోయి ఔన్స్‌కు 1532.60 డాలర్లుగా ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా ప్రతీకార చర్యలను చైనా వాయిదా వేయడం సానుకూల స్పందనకు దారితీసినట్టు టీడీ సెక్యూరిటీస్‌ గ్లోబల్‌ స్ట్రాటజీ హెడ్‌ బార్ట్‌ మెలెక్‌ తెలిపారు. వారం మొత్తం మీద లాభాలను కోల్పోయినప్పటికీ, బంగారం కీలక మద్దతు స్థాయి 1,530 డాలర్లకు పైనే నిలిచింది. ఇది కొనసాగితే భవిష్యత్తులో ధరలు పెరిగేందుకే అవకాశం ఉందని బ్లూలైన్‌ ఫ్యూచర్స్‌ ప్రెసిడెంట్‌ బిల్‌ బరూచ్‌ తెలిపారు.

బంగారం 1,530 డాలర్ల పైన ఉన్నంత వరకు తాను బుల్లిష్‌గానే ఉంటానని, 1,530 డాలర్లకు దిగువన ముగిస్తే 1,500 దిశగా తగ్గుతుందని బరూచ్‌ చెప్పారు. ఈ వారంలో బంగారం మరింత కన్సాలిడేషన్‌కు అవకాశాలు లేకపోలేదని ఎక్కువ మంది అనలిస్టులు భావిస్తున్నారు. ‘‘బంగారం కొంత మేర దిగువకు వెళ్లొచ్చు. అమెరికా డేటా క్షీణతను సూచిస్తే, ఫెడ్‌ మరింత డోవిష్‌గా వ్యవహరిస్తుంది. దాంతో ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు పెరగడంతోపాటు, బంగారం అధిక స్థాయికి వెళుతుంది. గణనీయంగా పెరగడాన్ని చూడొచ్చు. దిగువ వైపున 1,488 మద్దతుగా వ్యవహరిస్తుంది’’ అని మెలెక్‌ వివరించారు.  

పావెల్‌ వ్యాఖ్యలపై దృష్టి...
స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ జ్యూరిచ్‌లో వచ్చే శుక్రవారం అమెరికా ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రసంగించనున్నారు. దీనికంటే ముందు ఆగస్ట్‌ నెలకు సంబంధించి అమెరికా ఉద్యోగ గణాంకాల డేటా బయటకు రానుంది. సెప్టెంబర్‌ 18 నాటి ఫెడ్‌ రేట్ల నిర్ణయానికి ముందు పావెల్‌ చివరి ప్రసంగం ఇదే. ఈ నెలలో మరో విడత రేట్ల కోత ప్రణాళికను ఆయన ప్రకటించొచ్చని క్యాపిటల్‌ ఎకమనిక్స్‌ యూఎస్‌ ఎకనమిస్ట్‌ ఆండ్రా్యూ హంటర్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top