కోవిడ్‌కు ఔషధం- గ్లెన్‌మార్క్‌ దూకుడు

Glenmark Pharma jumps on Covid-19 drug Fabiflu release - Sakshi

ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ. 103

15 శాతం దూసుకెళ్లిన షేరు

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 చికిత్సకు వినియోగించగల యాంటీవైరల్‌ ఔషధం ఫావిపిరవిర్‌ను దేశీ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికం కావడంతో రూ. 61.5 ఎగసి రూ. 471 వద్ద ట్రేడవుతోంది. 

ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ. 103 రూపాయిలు
ఫబిఫ్లూ బ్రాండుతో ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్లను కొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా వెల్లడించింది. ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ. 103 రూపాయిలు కాగా.. తొలి రోజు 1800 ఎంజీ డోసేజీ రెండుసార్లు వేసుకోవలసి ఉంటుందని వివరించింది. తదుపరి 14వ రోజువరకూ రోజుకి 800 ఎంజీ చొప్పున రెండు పూటలా తీసుకోవలసి ఉంటుందని తెలిపింది. (కోవిడ్‌కు మరో ఔషధం.. )

మూడో దశ క్లినికల్‌ పరీక్షల డేటా ఆధారంగా ఫావిపిరవిర్‌ ఔషధాన్ని విక్రయించేందుకు ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ డీజీసీఏ నుంచి అత్యవసర ప్రాతిపదికన అనుమతి లభించినట్లు పేర్కొంది. తద్వారా కోవిడ్‌-19 సోకినవారి చికిత్సకు వీటిని వినియోగించేందుకు వీలు చిక్కినట్లు  ఫార్మా వర్గాలు తెలియజేశాయి. ఈ ఔషధానికి క్లినికల్‌ పరీక్షలలో 88 శాతంవరకూ సానుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా పేర్కొంది. నాలుగు రోజుల్లోనే వైరస్‌ లోడ్‌ను గణనీయంగా తగ్గించగలిగినట్లు వెల్లడించింది. ఫావిపిరవిర్‌ను జపాన్‌లో ఇన్‌ఫ్లుయెంజా చికిత్సకు వినియోగిస్తున్న విషయం విదితమే. (కరోనా చికిత్సకు గ్లెన్మార్క్ ఔషధం)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top