ఎఫ్‌ఎమ్‌ లాజిస్టిక్‌  రూ.1,000 కోట్ల పెట్టుబడులు

FM logistics worth Rs 1,000 crore - Sakshi

గోదాముల నిర్మాణం కోసం 

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన ఎఫ్‌ఎమ్‌ లాజిస్టిక్‌ కంపెనీ భారత్‌లో రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. గోదాముల నిర్మాణం కోసం ఐదేళ్లలో ఈ పెట్టుబడులు పెడతామని ఎఫ్‌ఎమ్‌ లాజిస్టిక్‌ తెలిపింది. భారత్‌లో వృద్ధి బాగా ఉందని కంపెనీ సీఈఓ జీన్‌–క్రిస్టోఫ్‌ మాచెట్‌ పేర్కొన్నారు. దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పాటునందించేందుకు గాను వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టనున్నామని వివరించారు. నాలుగు మెట్రో నగరాలను కలుపుకొని మొత్తం ఐదు నగరాల్లో గోదాముల నిర్మాణం చేపడతామని తెలిపారు. నిధుల కోసం స్థానిక, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. జీఎస్‌టీ కారణంగా ఈ రంగంలో అపార అవకాశాలు లభించాయని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

ఏడాదిలో 500 మందికి ఉద్యోగాలు 
మొదటగా ముంబైలో తొలి మల్టీ క్లయింట్‌ వేర్‌హౌస్‌ను అందుబాటులోకి తెస్తామని, ఢిల్లీ ఎన్‌ఎస్‌ఆర్‌లో నెలరోజుల్లోనే మరో వేర్‌హౌస్‌ను అందుబాటులోకి తెస్తామని మాచెట్‌ తెలిపారు. గుర్గావ్‌ సమీపంలోని జాజ్‌పూర్‌లో 31 ఎకరాలను కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌లతో ఏడాది కాలంలో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. భారత కార్యకలాపాల కోసం కొత్త ఎమ్‌డీగా అలెగ్జాండర్‌ అమైనె సౌఫియానిని నియమించామని వెల్లడించారు. పుణేకు చెందిన స్పియర్‌ లాజిస్టిక్స్‌ కంపెనీని 2016లో కొనుగోలు చేయడం ద్వారా ఎఫ్‌ఎమ్‌ లాజిస్టిక్‌ కంపెనీ భారత్‌లోకి       ప్రవేశించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top