ఫెడరల్‌ బ్యాంకు లాభాలకు ఎన్‌పీఏల దెబ్బ | Federal Bank Q2 profit inches up 1% YoY to Rs 266 crore | Sakshi
Sakshi News home page

ఫెడరల్‌ బ్యాంకు లాభాలకు ఎన్‌పీఏల దెబ్బ

Oct 17 2018 12:11 AM | Updated on Oct 17 2018 12:11 AM

Federal Bank Q2 profit inches up 1% YoY to Rs 266 crore - Sakshi

ముంబై: ప్రైవేటు రంగంలోని ఫెడరల్‌ బ్యాంకుకు సెప్టెంబర్‌ త్రైమాసికంలో మొండి బకాయిల కాక తగిలింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఫెడరల్‌ బ్యాంకు నికర లాభం కేవలం 0.88 శాతానికే పరిమితం అయింది. బ్యాంకు ప్రొవిజన్స్‌ 63 శాతం పెరిగి రూ.288 కోట్లకు చేరాయి. దీంతో లాభం రూ.266 కోట్లకు పరిమితం అయింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.263.70 కోట్లుగా ఉండటం గమనార్హం.

కేరళ వరదల ప్రభావం ఊహించదానికంటే ఎక్కువేమీ లేదని బ్యాంకు ప్రకటించింది. ‘‘రుణ నష్టాల కోసం రూ.152 కోట్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. బ్యాంకు పలు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ.105 కోట్లు, స్టాండర్డ్‌ అసెట్స్‌ కోసం రూ.30 కోట్లు కేటాయించాం’’ అని ఫెడరల్‌ బ్యాంకు ఎండీ, సీఈవో శ్యామ్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. కేరళ వరదల కారణంగా బ్యాంకు లాభాలపై రూ.35 కోట్ల మేర ప్రభావం ఉన్నట్టు చెప్పారు.

బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 13.75 శాతం వృద్ధితో రూ.1,022 కోట్లుగా నమోదైంది. బ్యాంకు రుణాలు 26 శాతం పెరగడం, నికర వడ్డీ మార్జిన్‌ స్వల్పంగా పెరిగి 3.15 శాతానికి చేరడం కలిసొచ్చాయి. ఇతర ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.287 కోట్ల నుంచి రూ.322 కోట్లకు చేరింది.  

పెరిగిన ఎన్‌పీఏలు
బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల ఎన్‌పీఏలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 2.39 శాతం నుంచి 3.11 శాతానికి పెరిగాయి. తాజాగా రూ.477 కోట్ల మేర రుణాలు ఎన్‌పీఏల్లోకి వచ్చి చేరాయి. ముఖ్యంగా ఎస్‌ఎంఈ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.169 కోట్ల మేర ఎన్‌పీఏలకు జతయ్యాయి. ఆ తర్వాత కార్పొరేట్‌ రంగం నుంచి రూ.120 కోట్లు ఎన్‌పీఏలుగా మారాయి. తాజా ఎన్‌పీఏల్లో కేరళ వరదల కారణంగా వచ్చి చేరినవీ రూ.50 కోట్లు ఉన్నట్టు బ్యాంకు ఎండీ శ్రీనివాసన్‌ తెలిపారు. అంతేకాదు కేరళ వరదల ప్రభావంతో రానున్న రెండు క్వార్టర్లలోరూ రూ.50 కోట్ల చొప్పున ఎన్‌పీఏలు అదనంగా ఉంటాయని బ్యాంకు అంచనా వేసింది.

కేరళ వరదల అనంతరం రుణ వ్యయాలు 0.65–0.75 శాతంగా ఉంటాయని, తాజా ఎన్‌పీఏలు 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల మేర ఉండొచ్చన్న సవరించిన అంచనాలకు కట్టుబడి ఉన్నట్టు శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో బ్యాంకుకు ఎక్స్‌పోజర్‌ లేదని స్పష్టం చేశారు. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి రూ.12,000 కోట్ల మేర ఎక్స్‌పోజర్‌ ఉండగా, ఇందులో టాప్‌ 5 ఎన్‌బీఎఫ్‌సీల వాటా 40 శాతంగా ఉన్నట్టు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో ఫెడరల్‌ బ్యాంకు షేరు బీఎస్‌ఈలో 7.86 శాతం లాభపడి రూ.81.65 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement