ఫేస్‌బుక్‌పై ఎఫ్‌టీసీ విచారణ షురూ!

Facebook faces probe by US trade commission       - Sakshi

వాషింగ్టన్:  ఫేస్‌బుక్‌  డేటా బ్రీచ్‌పై విచారణను యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (ఎఫ్‌టీసీ) ధృవీకరించింది. అమెరికా బ్రిటిష్ కంపెనీ కేంబ్రిడ్జ్ ఎనలిటికాతో సంబంధాలు, 5కోట్ల  ఖాతాదారుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఫేస్‌బుక్‌,  గోప్యతా అభ్యాసాలపై విచారణ  కొనసాగుతోందని బ్యూరో ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్టింగ్‌ డైరెక్టర్  టామ్‌ పాల్‌ వెల్లడించారు.  ఎఫ్‌టీసీ చట్ల నిబంధనల ఉల్లంఘనతోపాటు,  వినియోగదారులకు  హాని కలిగించే అక్రమ చర్యలపై  కఠిన చర్యలు తీసుకుంటామని  సోమవారం జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

ఫేస్‌బుక్‌ ప్రైవసీ ఆచరణపై తీవ్ర ఆందోళన రేపిన ఇటీవల ప్రెస్ నివేదికలను పరిశీలిస్తున్నామని, వినియోగదారుల ప్రైవసీ భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని  పాల్ చెప్పారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామన్నారు.   మరోవైపు అమెరికాలోని 37 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్  ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు ఒక లేఖ రాశారు. కోట్లాది వినియోగదారుల  డేటా లీక్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ  లేఖ రాశారు. అనుమతి లేకుండా  వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్నిథర్డ్‌ పార్టీకు ఎలా అందిస్తారంటూ ఈ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  గోప్యతపై చేసిన వాగ్దానాలను భంగపరిచిన ఫేస్‌బుక్‌ను యూజర్లు  ఇపుడు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. తమ నమ్మకం వమ్ము అయిందని పేర్కొన్నారు.  వినియోగదారుల డేటాను తారుమారు చేయడంలో ఫేస్‌బుక్‌ పాత్రపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  న్యూజెర్సీ అటార్నీ జనరల్ గుర్బీర్ ఎస్ గ్రేవల్‌ సహా 37మంది అటార్నీ జనరల్స్‌ స​ ఈ లేఖపై సంతకాలు చేశారు.

కాగా  అమెరికా ఎన్నికల సందర్భంగా ఫేస్‌బుక్‌ తన ఖాతాదారుల డేటాను కేంబ్రిడ్జి ఎనలిటికాకు విక్రయించిందన్న వార్త ప్రకంపనలు పుట్టించింది. దీంతో తప్పు ఒప్పుకున్న ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు  జుకర్‌బర్గ్‌ క్షమాపణ కోరడంతోపాటు, దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. అలాగే  బ్రిటన్, అమెరికాలోని ప్రముఖ పత్రికల్లో ప్రకటనల రూపంలో క్షమాపణలు కోరారు.  యూజర్ల సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందనీ అది చేయలేకపోతే ఈ స్థానానికి  అనర్హులమంటూ  ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే టాప్‌ టెక్‌  కంపనీలు ఫేస్‌బుక్‌ పేజీలను డిలీట్‌ చేయడంతో  ఈ వివాదంలో యూజర్ల భద్రతపై  ఆందోళన మరింత ముదురుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top