లక్ష్యాన్ని మించనున్న ఎగుమతులు | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని మించనున్న ఎగుమతులు

Published Tue, Aug 19 2014 2:36 AM

లక్ష్యాన్ని మించనున్న ఎగుమతులు - Sakshi

ముంబై: తయారీ రంగం ఊపందుకోనుండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ అధిగమించే అవకాశం ఉందని దేశీయ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) తెలిపింది. ‘అమెరికా, యూరోపియన్ యూనియన్‌లతో పాటు వర్థమాన దేశాల్లో అభివృద్ధి జోరందుకుంటోంది. దీంతో భారత్ నుంచి ఎగుమతులు త్వరలోనే పెరుగుతాయి...’ అని ఎఫ్‌ఐఈఓ అధ్యక్షుడు రఫీక్ అహ్మద్ సోమవారం మీడియాతో చెప్పారు.

 గత నెల(జూలై)లో ఎగుమతుల వృద్ధి రేటు 7.33 శాతానికి తగ్గిపోగా దిగుమతులు 4.25 శాతం పెరిగాయి. అంకెల్లో చూస్తే జూలైలో ఎగుమతులు 2,772 కోట్ల డాలర్లు కాగా దిగుమతులు 3,995 కోట్ల డాలర్లు. గత నెలలో ఎగుమతులు పది శాతానికి మించి పెరుగుతాయని భావించామని అహ్మద్ చెప్పారు. ఇంజినీరింగ్, కెమికల్స్, ఔషధాలు, దుస్తులు, తోలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా ఉన్నప్పటికీ రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, జౌళి ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయన్నారు.

 దాని ప్రభావం మొత్తం ఎగుమతులపై పడిందని వివరించారు. జూలైలో చమురు దిగుమతులు 12.75 శాతం పెరిగి 1,435 కోట్ల డాలర్లకు, చమురేతర దిగుమతులు 0.03 శాతం వృద్ధితో 2,560 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. బంగారం దిగుమతులు 26.39 శాతం క్షీణించి 181 కోట్ల డాలర్లకు చేరాయని తెలిపారు. ఎగుమతులు మే నెలలో 12.4 శాతం, జూన్‌లో 10.22 శాతం వృద్ధిచెందాయని అన్నారు.

 స్వల్పంగా పెరగనున్న వాణిజ్యలోటు: సిటీ
 న్యూఢిల్లీ: వాణిజ్యలోటు (దిగుమతులు-ఎగుమతుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసం)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 142 బిలియన్ డాలర్లు ఉండవచ్చని సిటీగ్రూప్ పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఈ లోటు 139 బిలియన్ డాలర్లు. ఇక కరెంట్ అకౌంట్ లోటు (క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న వ్యత్యాసం) 39.3 బిలియన్ డాలర్లు (జీడీపీ పరిమాణంలో 1.9 శాతం) ఉంటుందనీ అంచనావేసింది. డాలర్ మారకంలో రూపాయి రూ.59-62 శ్రేణిలో ఉంటుందని విశ్లేషించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement