మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌.. చలో ఫారిన్‌!

 Equity mutual funds still hot despite correction - Sakshi

 దేశీయ మార్కెట్లలో అస్థిరతలు

యూఎస్, జపాన్‌ మార్కెట్ల ర్యాలీ

విదేశీ మార్కెట్లో అవకాశాలపై కన్ను

ఇందుకోసం ప్రత్యేకమైన పథకాల ఆవిష్కరణ

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో మన ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆస్థిరతల మధ్య కదలాడుతూ, నష్టాలను పంచుతున్నాయి. ఇందుకు ఎక్కువగా అంతర్జాతీయ అంశాలే కారణం. దీంతో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పేరొందిన పథకాల రాబడులు గత ఏడాది కాలంలో చూసుకుంటే మైనస్‌లోకి వెళ్లిపోయాయి. కానీ, ఇదే సమయంలో అమెరికా మార్కెట్లు మంచి ర్యాలీ చేస్తున్నాయి. మన మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి నష్టాలు, అమెరికా మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి లాభాలు అన్నట్టు పరిస్థితిలో మార్పు వచ్చింది. అందుకే ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అమెరికా తదితర విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించిన మ్యూచువల్‌ ఫండ్స్‌ స్కీమ్‌లను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కనీసం 10 శాతం పెట్టుబడులను విదేశీ కంపెనీలకు కేటాయించుకోవాలని నిపుణులు సూ చిస్తున్నారు. గణనీయమైన పెట్టుబడులు మన దేశ మార్కెట్లలోకి రావడం వల్లే గత రెండు సంవత్సరాల్లో భారీ ర్యాలీకి కారణంగా పేర్కొంటున్నారు. 

ఐఐఎఫ్‌ఎల్‌ ఏంఎసీ నుంచి పథకం 
ఐఐఎఫ్‌ఎల్‌ ఏఎంసీ ‘ఐఐఎఫ్‌ఎల్‌ యూఎస్‌ టెక్నాలజీ ఫండ్‌’ను ఈ నెల్లోనే ప్రారంభించనుంది. ‘‘అంతర్జాతీయంగా వృద్ధి అవకాశాలున్నప్పటికీ భారతీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం లేదు. టెక్నాలజీ కంపెనీలైన ఫేస్‌బుక్, యాపిల్‌ గత కొన్నేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాయి. కానీ భారత ఇన్వెస్టర్లు వీటిలో పాలు పంచుకోలేదు’’ అని ఐఐఎఫ్‌ఎల్‌ ఏఎంసీ సీఈవో ప్రశస్తసేత్‌ తెలిపారు. ఈ తరహా పథకాలను ఈ సమయంలో తీసుకురావడం అనుకూలమని... డాలర్‌ బలోపేతం అవడం వల్ల ఇన్వెస్టర్లకు అదనపు రాబడులు సమకూరుతాయన్నారు. ఇటువంటివే మరికొన్ని పథకాలను తర్వాత ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్టు సేత్‌ చెప్పారు. ఉదాహరణకు... ‘‘ఈ ఏడాది ప్రారంభం నుంచి డాలర్‌తో రూపాయి 14 శాతం క్షీణించింది. అంటే ఎస్‌అండ్‌పీ500పై రూ.100 డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ కాస్తా రూ.114 డాలర్లు అయింది. అమెరికా స్టాక్స్‌ పెరుగుదల కలపకుండా చూస్తేనే ఈ మాత్రం పెరుగుదల ఉంది. డాలర్‌ రూపంలో చూస్తే... జపాన్, అమెరికా ఈ ఏడాదిలో 5–9 శాతం మధ్యలో రిటర్నులు ఇచ్చాయి. రూపాయి మారకంలో చూస్తే ఈ రాబడులు 20–24 శాతానికి సమానం’’ అని నిపుణుల విశ్లేషణ. ఇప్పటికే మేము పలు అంతర్జాతీయ పెట్టుబడి అవకాశాలతో పథకాలను అందిస్తున్నాం. వీటి అవసరంపై క్లయింట్లతో మాట్లాడుతున్నాం. రూపాయి క్షీణతతో దేశీయ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన అవకాశాల కోసం చూస్తున్నారు. ఈ అవకాశాలు కేవలం అమెరికా మార్కెట్లకే పరిమితం కాదు. చైనా, యూరోప్, అమెరికా, కొన్ని ఆసియా దేశాలు సైతం ఇటీవల మంచి ర్యాలీ చేశాయి’’అని ఎడెల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో రాధికా గుప్తా తెలిపారు. 

యాక్సిస్‌ నుంచి కొత్త పథకం  
యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇప్పటికే యాక్సిస్‌ గ్రోత్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ను ఆరంభించింది. ఈ పథకం 65–70 శాతం పెట్టుబడులను దేశీయ కంపెనీలకు కేటాయిస్తుంది. 30–35 శాతం పెట్టుబడులను విదేశీ కంపెనీలకు కేటాయిస్తుంది. అమెరికా, యూరోప్, పశ్చిమాసియా, జపాన్‌ ప్రాంతాల్లో అవకాశాలను ఈ పథకం గుర్తించి ఇన్వెస్ట్‌ చేస్తుంది. బ్రిటన్‌కు చెందిన ష్రోడర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సూచనల మేరకు పెట్టుబడులు పెడుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top