మరో రూ. 8వేల కోట్లు కట్టిన టెల్కోలు

Eight Thousand Crore Paid By The Telecom Companies - Sakshi

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి టెలికం సంస్థలు మంగళవారం మరో రూ. 8,000 కోట్లు కేంద్రానికి చెల్లించాయి. వొడాఫోన్‌ ఐడియా రూ. 3,043 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌ రూ. 1,950 కోట్లు, రిలయన్స్‌ జియో రూ. 1,053 కోట్లు, టాటా టెలీసర్వీసెస్‌ రూ. 2,000 కోట్లు కట్టాయి. ఇప్పటికే పూర్తి సెటిల్‌మెంట్‌ కోసం రూ. 2,197 కోట్లు కట్టామన్న టాటా టెలీసర్వీసెస్‌.. ఒకవేళ లెక్కల్లో వ్యత్యాసాలేమైనా వచ్చినా సర్దుబాటు చేసేందుకు వీలుగా అదనపు మొత్తం కట్టినట్లు వెల్లడించింది. మరోవైపు, వొడాఫోన్‌ ఐడియా(వీఐఎల్‌) సీఈవో రవీందర్‌ టక్కర్‌ మరోసారి  టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో భేటీ అయ్యారు.

అయితే, సమావేశం వివరాలు ఆయన వెల్లడించలేదు. అటు.. వీఐఎల్‌ ఎప్పట్లోగా బాకీల స్వీయ మదింపు పూర్తి చేస్తుందన్న ప్రశ్నకు స్పందించేందుకు టక్కర్‌ నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీ (ఎస్‌యూసీ) బాకీల కింద 15 టెలికం సంస్థలు.. సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది.   ఏజీఆర్‌ బాకీల విషయంలో టెల్కోల స్వీయ మదింపు, తమ లెక్కల్లో వ్యత్యాసాలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయా సంస్థలకు టెలికం శాఖ త్వరలోనే లేఖలు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top