కార్యాలయాలకే గిరాకీ!

Demand for IT corridors in Hyderabad - Sakshi

హైదరాబాద్‌లో  ఐటీ కారిడార్లకే డిమాండ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో 2018 తొలి త్రైమాసికంలో కార్యాలయాల స్థిరాస్తి మార్కెట్‌కు ఊపొచ్చింది. సప్లయి తక్కువగా ఉండటం... డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఐటీ కారిడార్లకు గిరాకీ పెరిగింది. హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ రియల్టీ మార్కెట్‌లో టెక్‌ కంపెనీలు ఆ తర్వాత ఇంజనీరింగ్, తయారీ సంస్థల లావాదేవీలు ఎక్కువగా జరిగాయని దేశంలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా నివేదిక తెలిపింది. నగరంలో డిమాండ్‌ పెరగడంతో మైక్రో మార్కెట్లలో అద్దె ధరలు పెరిగాయి. 2018 జనవరి–మార్చి మధ్య తొలి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన మార్కెట్లలో 11 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ను అద్దెకిచ్చారు. 2017 క్యూ1తో పోలిస్తే ఇది 25 శాతం వృద్ధి. స్థలాలను అద్దెకు తీసుకున్న వాటిల్లో 25 శాతం టెక్‌ కంపెనీలు, బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు 24 శాతం, ఈ–కామర్స్‌ సంస్థలు 15 శాతం ఉన్నాయి.  ఎక్కువ లావాదేవీలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లోనే ఎక్కువగా జరిగాయి. క్యూ1లో దేశంలో అత్యధిక ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో బెంగళూరు నిలిచింది. బీఎఫ్‌ఎస్‌ఐ, ఈ–కామర్స్‌ సంస్థలు ఎక్కువ లావాదేవీలు జరిపాయి. అద్దెలూ పెరిగాయి.

హైదరాబాద్‌లో 3–12 శాతం పెరిగిన అద్దెలు..
2018 తొలి త్రైమాసికంలో బేగంపేట్, రాజ్‌భవన్‌ రోడ్, బంజారాహిల్స్‌ 1, 2, 19, 12 రోడ్ల్లలో ఆఫీస్‌ లీజింగ్‌ కార్యకలాపాలు పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో 3–5 శాతం అద్దెలు పెరిగాయి. హైటెక్‌ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్లలో సప్లయి పరిమితంగా ఉండటంతో అద్దెలు 8–12 శాతం పెరిగాయి. నానక్‌రాంగూడ, రాయదుర్గం, మణికొండ, కూకట్‌పల్లిల్లో కార్పొరేట్‌ సంస్థలు ఆసక్తి చూపించడంతో అద్దెలు 6–18 శాతం మేర పెరిగాయి.

కనెక్టివిటీ కలిసొచ్చింది..: నైపుణ్యమున్న యువత, అందుబాటు ధరలు, అద్దెలు, మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో మెరుగైన కనెక్టివిటీలతో ప్రస్తుతం నగరంలో ఉన్న కార్పొరేట్‌ సంస్థలతో పాటూ కొత్త కంపెనీల ఆకర్షణలో ప్రధానంగా మారాయని సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా డైరెక్టర్‌ రోమిల్‌ దూబే తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top