ఇది విలువలు సాధించిన విజయం..

Cyrus Mistrys Victory Not Personal  But For Principles   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌ చీఫ్‌గా సైరస్‌ మిస్త్రీ తిరిగి బాధ్యతలు చేపట్టాలన్న నేషనల్‌ కంపనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌క్లాట్‌) ఉత్తర్వులపై మిస్త్రీ స్పందించారు. ట్రిబ్యునల్‌ తీర్పును సుపరిపాలన సూత్రాల విజయంగా ఆయన అభివర్ణించారు. టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ నియామకాన్ని ఎన్‌క్లాట్‌ పునరుద్ధరించిన అనంతరం ట్రిబ్యునల్‌ తీర్పును స్వాగతిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈరోజు వెలువడిన తీర్పు తనకు వ్యక్తిగత విజయం ఎంతమాత్రం కాదని, సుపరిపాలన సూత్రాలు, టాటా సన్స్‌ మైనారిటీ వాటాదారు హక్కుల విజయమేనని వ్యాఖ్యానించారు.

మిస్ర్తీ కుటుంబం గత యాభై సంవత్సరాలుగా టాటా సన్స్‌లో ప్రాముఖ్యత కలిగిన మైనారిటీ వాటాదారుగా దేశం గర్వించదగిన సంస్థకు బాధ్యతాయుతమైన సంరక్షకుడిగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు. మూడేళ్ల కిందట టాటా సన్స్‌ చీఫ్‌గా బోర్డు తనను తొలగించిన అనంతరం తాను చేపట్టిన పోరాటానికి ఫలితంగానే ఈ తీర్పు వెలువడిందని అన్నారు. కాగా, టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమని, గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ తిరిగి పగ్గాలు చేపట్టాలని నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది.

చదవండి : సైరస్‌ మిస్త్రీకే టాటా సన్స్‌ పగ్గాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top