వ్యాపారవేత్తగా విఫలమయ్యా... 

Coffee King Siddhartha suicide letter - Sakshi

ఆర్థిక ఒత్తిళ్లతో అదృశ్యమైన వీజీ సిద్ధార్థ కాఫీ డే ఉద్యోగులు, బోర్డు సభ్యులకు రాసినట్లు పేర్కొంటూ ఒక లేఖ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిద్ధార్థ కనిపించకుండాపోవడానికి రెండు రోజుల ముందు(ఈ నెల 27న) తేదీతో ఈ లేఖ ఉండటం గమనార్హం. ఆయన లేఖలో ఏం చెప్పారంటే... 

‘గడిచిన 37 ఏళ్లుగా ఎంతో నిబద్ధతతో కష్టపడిపనిచేస్తూ నేను స్థాపించిన కంపెనీలు, అనుబంధ సంస్థల్లో 30 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించా. అదేవిధంగా నేను అతిపెద్ద వాటాదారుగా ఉన్న మరో టెక్నాలజీ కంపెనీలో కూడా 20 వేల కొలువులను తీసుకొచ్చా. అయితే, నా కష్టమంతా ధారపోసినప్పటికీ.. ఆయా సంస్థలను లాభదాయకమైన వ్యాపార దిగ్గజాలుగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యా. నామీద నమ్మకంతో చేదోడుగా నిలిచినవారందరినీ క్షమించమని కోరుతున్నా. ఎందుకంటే నేను ఎంతగా ప్రయత్నించినా నామీద ఉన్న ఒత్తిళ్లతో నిస్సహాయుడిగా ఉండిపోయా. ప్రైవేటు ఈక్విటీ(పీఈ) భాగస్వామ్య సంస్థల్లో ఒకదాని నుంచి షేర్ల బైబ్యాక్‌ కోసం విపరీతమైన ఒత్తిడి రావడంతో స్నేహితుల నుంచి భారీ మొత్తంలో అప్పులుతెచ్చిమరీ కొంత మేరకు ఈ లావాదేవీలను ఆరు నెలల క్రితం పూర్తిచేశాను.

మరోపక్క, రుణ దాతల నుంచి కూడా ఒత్తిడి పెరిగిపోవడంతో పరిస్థితి దిగజారింది. అంతేకాదు.. మైండ్‌ట్రీలో షేర్ల అమ్మకం డీల్‌కు సంబంధించి గతంతో ఆదాయపు పన్ను(ఐటీ) డీజీ నుంచి కూడా వేధింపులను ఎదుర్కొన్నా. ఒప్పందాన్ని అడ్డుకోవడం కోసం రెండుసార్లు నా వాటా షేర్లను అటాచ్‌ చేయడంతో పాటు కాఫీ డే షేర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్నులను వాళ్లు చెప్పినట్లు సవరించి వేసినా నన్ను వేధించారు. ఈ అన్యాయమైన చర్యలతో కంపెనీలో తీవ్రమైన నగదు కొరతకు దారితీసింది. నా ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఈ సమయంలో మీరంతా కొత్త యాజమాన్యం నేతృత్వంలో మన వ్యాపారాన్ని కొనసాగించేందుకు శక్తివంచనలేకుండా కృషిచేయాలని కోరుతున్నాను. జరిగిన తప్పులన్నింటికీ నాదే పూర్తి బాధ్యత. అంతేకాదు సంస్థలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నింటికీ కూడా నేనే బాధ్యత తీసుకుంటున్నా. ఆడిటర్లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఇతరత్రా ఉద్యోగులెవరికీ వీటి గురించి తెలియదు. చివరికి నా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలను చెప్పలేదు. మోసం చేయడం, తప్పుదోవపట్టించాలన్నది నా ఉద్దేశం కానేకాదు. చట్టపరంగా ఈ మొత్తం పరిణామాలన్నింటికీ నాదే బాధ్యత. ఒక వ్యాపారవేత్తగా నేను విఫలమయ్యాను. ఎదో ఒకరో జు నా నిజాయితీని మీరంతా గుర్తించి, నన్ను క్షమిస్తారని భావిస్తున్నా. నాకున్న ఆస్తుల విలువతో పాటు వాటి జాబితాను కూడా మీకు తెలియజేస్తున్నా. అప్పులన్నీ తీర్చేయడానికి నా ఆస్తులు సరిపోతాయి’ 
 – వీజీ సిద్ధార్థ  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top