ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

Coffee Day deleverages assets for debt reduction - Sakshi

లిక్విడిటీ మెరుగునకు కాఫీడే చర్యలు

న్యూఢిల్లీ: ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడం (డీలివరేజింగ్‌) ద్వారా లిక్విడిటీ మెరుగునకు కాఫీ డే ఎంటర్‌ ప్రైజెస్‌ చర్యలు చేపట్టింది. ఇటీవలే కాఫీ డే ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ (సీడీఈఎల్‌) దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘డి’ (ప్రతికూల దృక్పథానికి) ఇక్రా సంస్థ డౌన్‌ గ్రేడ్‌ చేసింది. అంతకుముందు వరకు బీబీ ప్లస్‌ నెగెటివ్‌ రేటింగ్‌ ఉండేది. రూ.315 కోట్ల దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఈ రేటింగ్‌ను ఇచ్చింది. సీడీఈఎల్‌ ఫ్లాగ్‌షిప్‌ సబ్సిడరీ అయిన కాఫీ డే గ్లోబల్‌ లిమిటెడ్‌, సికాల్‌ గ్రూపు కంపెనీలకు సంబంధించి రుణ చెల్లింపులు ఆలస్యం అవడంతో రేటింగ్‌ను తగ్గించినట్టు స్వయంగా సీడీఈఎల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడంతోపాటు, నిధుల లభ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్టు సికాల్‌ లాజిస్టిక్స్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ కంపెనీకి రూ.1,488 కోట్ల రుణభారం ఉంది. దీనికి కాఫీ డే గ్రూపు ప్రమోటర్‌, ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న వీజీ సిద్ధార్థ వ్యక్తిగత హామీదారుగా ఉన్నారు. సికాల్‌ లాజిస్టిక్స్‌ పోర్ట్‌ టెర్మినళ్లు, ఫ్రైట్‌ స్టేషన్లలను నిర్వహిస్తోంది. సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత... సీడీఈఎల్‌ తన రుణ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించడాన్ని గమనించొచ్చు. ఇందులో భాగంగానే బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్‌ టెక్నాలజీ పార్క్‌ను సుమారు రూ.3,000 కోట్లకు బ్లాక్‌స్టోన్‌ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top