ప్రపంచ స్టీల్‌ మార్కెట్‌ను దెబ్బతీస్తున్న చైనా

China damaging global steel market - Sakshi

అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌రాస్‌ 

వాషింగ్టన్‌: ప్రపంచ స్టీల్‌ మార్కెట్‌కు చైనా  విఘాతం కలిగించడంతోపాటు... ప్రత్యక్షంగా, పరోక్షంగా దానికి నష్టం కలగజేస్తోందని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ ఆరోపించారు. స్టీల్‌ దిగుమతులపై 25%, అల్యూమినియం ఉత్పత్తులపై 10% టారిఫ్‌ విధిస్తూ ట్రంప్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అనైతిక వ్యాపార విధానాల ఫలితంగా సమస్యలను ఎదుర్కొంటున్న అమెరికా పరిశ్రమను కాపాడేందుకు ఈ స్థాయిలో టారిఫ్‌ల విధింపు అవసరమని విల్బర్‌రాస్‌ సెనేట్‌ ఫైనాన్స్‌ కమిటీ సభ్యులకు వివరించారు. చైనా అమెరికాకు చేసే ఎగుమతులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని, ఇతర దేశాల ద్వారా వాటిని ఎగుమతి చేస్తోందని రాస్‌ పేర్కొన్నారు.  చైనా అనైతిక వాణిజ్య విధానాల ద్వారా మార్కెట్‌ వాటాను పెంచుకుంటోందన్న సెనేట్‌ సభ్యుల పరిశీలనతో రాస్‌ ఏకీభవించారు.  

అమెరికా చర్యలు దానికీ నష్టమే: చైనా 
చైనాకు చెందిన వందలాది బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలు, బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని చైనా విమర్శించింది. చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావోఫెంగ్‌ ఈ విషయమై మాట్లాడుతూ... ప్రపంచ వాణిజ్య క్రమాన్ని అమెరికా దెబ్బతీస్తోందని ఆరోపించారు. అమెరికా విధానాలు సొంత వాణిజ్యంతోపాటు, భాగస్వామ్య దేశాలకూ హాని కలగజేస్తాయన్నారు. అమెరికా టెక్నాలజీ, మేధో సంపత్తి హక్కులను చైనా హరిస్తోందంటూ ఆ దేశ ఉత్పత్తులపై ట్రంప్‌ సర్కారు 50 బిలియన్‌ డాలర్ల మేర టారిఫ్‌లకు ఆదేశించిన విషయం తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top