అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనం

Centre Open To Further Bank Consolidation - Sakshi

5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి భారీ బ్యాంకుల తోడ్పాటు

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్య 

న్యూఢిల్లీ: అవసరమైన పక్షంలో మరిన్ని బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు.. కన్సాలిడేషన్‌ ద్వారా ఏర్పడే అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు తోడ్పడగలవని ఆయన చెప్పారు. భారీ బ్యాంకులతో పెద్ద సంఖ్యలతో ప్రజలకు ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం గతేడాది ఏకంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేసే ప్రతిపాదన ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనాల కారణంగా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గనుంది. 2017 ఏప్రిల్‌లో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ)లో విలీనం చేశారు.

ఎల్‌ఐసీ లిస్టింగ్‌తో పారదర్శకత ..
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ లిస్టింగ్‌ చేయడం ద్వారా సంస్థలో మరింత పారదర్శకత పెరగగలదని ఠాకూర్‌ చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ప్రతిపాదన చేశారు. ఎల్‌ఐసీలో కొన్ని వాటాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 90,000 కోట్ల దాకా సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఎల్‌ఐసీలో 100 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాలు ఉన్నాయి. అటు రుణ పునర్‌వ్యవస్థీకరణ వెసులుబాటుతో గతేడాది దాదాపు అయిదు లక్షల లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రయోజనం చేకూరిందని ఠాకూర్‌ చెప్పారు. తాజాగా రుణ పునర్‌వ్యవస్థీకరణ వ్యవధిని వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top