స్మాల్‌ క్యాప్‌ సిప్‌లు ఇప్పుడు ఆపేయవచ్చా?

Can Small Cap Sips Now Stop? - Sakshi

నేను నెలకు కొంత మొత్తం సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఒక స్మాల్‌–క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇటీవలే నాకు బోనస్‌ రూ.2 లక్షల వరకూ వచ్చాయి. దీంట్లో ఒక లక్ష వరకూ  ఒకేసారి ఈ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? మార్కెట్‌ రికార్డ్‌స్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొంత కాలం ఆపేస్తే మంచిదని కొంతమంది మిత్రులు చెబుతున్నారు. మార్కెట్‌ పడిన తర్వాత మళ్లీ సిప్‌లను మొదలు పెట్టవచ్చని వారంటున్నారు. ఇది సరైనదేనా ? వారి సలహాను పాటించవచ్చా ? తగిన సూచనలు ఇవ్వండి.   – ఆనంద్, విశాఖపట్టణం
స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలోనే ఇన్వెస్ట్‌ చేయాలి.  లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌తో పోల్చితే స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయి. మార్కెట్‌ బాగా పెరుగుతున్నప్పుడు, లేదా బాగా పడిపోతున్నప్పుడు ఒడిదుడుకులు మరింత ఎక్కువగా ఉంటాయి. అందుకని స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఎప్పుడూ పెద్ద మొత్తాల్లో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయకూడదు. కొన్ని స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పెద్ద మొత్తాల్లో ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరించడం లేదు కూడా. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న పెద్ద మొత్తాన్ని ఆరు లేదా పన్నెండు భాగాలుగా విభజించండి.

మీరు రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేస్తున్న సిప్‌కు అదనంగా ఈ భాగాలను నెలకు ఒకటి చొప్పున జత చేసి ఆ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మార్కెట్‌ పెరగడం, తగ్గడం సహజమైన విషయాలే. ఇటీవల బాగా పెరిగినందున కొంత కరెక్షన్‌ రావడం సహజం. మార్కెట్‌ మరింతగా పడేదాకా ఎదురు చూసి, అప్పటిదాకా సిప్‌లను ఆపేసి, మార్కెట్‌ పడిన తర్వాత సిప్‌లను మళ్లీ మొదలు పెట్టడం సరైనది కాదు. మార్కెట్‌ ఎక్కడిదాకా పడిపోతుందో, ఎక్కడిదాకా పెరుగుతుందో ఖచ్చితంగా అంచనా వేయడం ఎవరి వల్లా కాదు. మార్కెట్‌ పడిపోవడం ఒకందుకు మంచిదే.  అందుకని సదరు స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించండి.

మార్కెట్‌ పడిపోతే, మీకు వీలైతే సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒకింత పెంచండి. మార్కెట్‌ బాగా పడిపోయినప్పుడు ఇన్వెస్ట్‌ చేసి, బాగా పెరిగినప్పుడు అమ్మకాలు జరపడం ద్వారా ఇన్వెస్టర్లు మంచి రాబడులు పొందవచ్చు. కానీ ఇలా చేయడం చాలా కష్టసాధ్యమైన పని. దీనికి మధ్యేమార్గంగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను క్రమం తప్పకుండా కొనసాగించడమే మంచిది. ఇలా రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, మీరు ఇన్వెస్ట్‌ చేసే కాలంలో మార్కెట్‌ ఎన్నో గరిష్ట స్థాయిలను, మరెన్నో కనిష్ట స్థాయిలను చూడవచ్చు. అందుకని మార్కెట్‌ ఉత్ధాన, పతనాలతో సంబంధం లేకుండా మీ సిప్‌లను కొనసాగించండి. మరోవైపు స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ల్లో సిప్‌ల ద్వారానే ఇన్వెస్ట్‌ చేయండి.
 
ఈక్విటీ–ఇన్‌కమ్‌ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? డెట్‌ ఫండ్స్‌ కన్నా ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ సురక్షితమా? – సౌమ్య, హైదరాబాద్‌  
ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్స్‌.. డెట్‌ ఫండ్స్‌ అంత సురక్షితమైనవి కావు. అయితే ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే ఒకింత సురక్షితమేనని చెప్పవచ్చు. ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ తమ నిధుల్లో మూడో వంతు ఈక్విటీలోనూ, మరో మూడవ వంతు ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లోనూ, మరో మూడో వంతు డెట్‌ సాధనాల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి.

ఈ ఫండ్స్‌ ఆర్బిట్రేజ్‌ పొజిషన్‌ దాదాపు లిక్విడ్‌ ఫండ్‌లాగానే ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్‌ను నిర్వహించే ఫండ్‌ మేనేజర్, ఒక షేర్‌ను కొనుగోలు చేసి, ఈ షేర్‌ ఫ్యూచర్స్‌ను విక్రయిస్తాడు.దీంతో ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేసిన మూడో వంతు భాగానికి రిస్క్‌ ఉండదు. ఈ ఫండ్‌ ఆర్బిట్రేషన్‌ పొజిషన్‌ సాంకేతికంగా ఈక్విటీగా ఉన్నప్పటికీ, క్యారెక్టర్‌ పరంగా చూస్తే, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌గా ఉంటుంది. అందుకని పన్ను పరంగా దీనిని ఈక్విటీ ఫండ్‌గానే పరిగణిస్తారు.

ఇక ఈ ఫండ్‌ నిధులు 35 శాతం వరకూ ఈక్విటీల్లో ఉన్నందున డెట్‌ ఫండ్‌ అంత సురక్షితంగా ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్‌ ఉండదని చెప్పవచ్చు. రిస్క్‌ ఎక్కువగా వద్దనుకుంటే, మూడు నుంచి ఐదేళ్ల కాలానికి ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మీరు ఇన్వెస్ట్‌ చేసే దాంట్లో  మూడో వంతు మాత్రమే ఈక్విటీల్లోకి వెళుతుంది కాబట్టి, ఒకేసారి పెద్ద మొత్తాల్లో కూడా ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.  

నేను ఒక సహకార బ్యాంక్‌లో ఐదేళ్ల కాలానికి కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. ఈ ఎఫ్‌డీలపై పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉందా ? – హఫీజ్, కరీంనగర్‌
ఐదేళ్ల కాల వ్యవధి ఉన్న ఏ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీరు పన్ను మినహాయింపులు పొందే అవకాశాలు లేవు. ట్యాక్స్‌ సేవింగ్‌/ట్యాక్స్‌ సేవర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేస్తేనే, అదీనూ ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేస్తేనే మీరు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 సి కింద పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది.

ట్యాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు లాక్‌–ఇన్‌–పీరియడ్‌ ఐదేళ్లుగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 సి కింద ఈ తరహా ట్యాక్స్‌–సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పన్ను మినహాయింపులు రూ.1.5 లక్షల వరకూ పొందవచ్చు.

- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top