
క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్ రివ్యూ
ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకునే వారు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు తప్పకుండా చోటు కల్పించుకోవాలి. పెట్టుబడులు అన్నింటినీ స్మాల్ క్యాప్స్‌లో కాకుండా.. తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా కేటాయింపులను నిర్ణయించుకోవాలి. చిన్న కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువ. కానీ, బలమైన ఆర్థిక మూలాలతో, మంచి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే చిన్న కంపెనీలు దీర్ఘకాలంలో మధ్య స్థాయి, బడా కంపెనీలుగా అవతరించగలవు. అటువంటి గొప్ప కంపెనీలను ముందుగా గుర్తించే నైపుణ్యాలు రిటైల్ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఉండవు. కనుక ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌పై ఆధారపడడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఈ విభాగంలో క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్ మంచి రాబడులను అందిస్తోంది.
రాబడులు
ఈ పథకం గడిచిన ఏడాది కాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ అద్భుతమైన రాబడులను అందించినట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఏటా 33 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో ఏటా 46 శాతం, ఏడేళ్లలో 27.60 శాతం, పదేళ్లలో 21 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకంలో నమోదైంది. ఇదే కాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే 10–12 శాతం వరకు వివిధ కాలాల్లో అధిక రాబడి వచ్చింది. ఈ పథకం 1996లో ప్రారంభమైంది. గతంలో క్వాంట్ ఇనకమ్ ఫండ్ పేరుతో కొనసాగింది. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే 14.43 శాతం ఎక్స్‌ఐఆర్‌ఆర్ రాబడి ఆధారంగా రూ.4.08 కోట్లు సమకూరేది.
పెట్టుబడుల విధానం..
‘క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ తాను అనుసరించే డైనమిక్ అస్సెట్ అలోకేషన్ విధానం కారణంగా అధిక ఆల్ఫాతో బలంగా నిలబడగలిగింది. అలాగే స్టాక్స్ ఎంపిక కోసం అనుసరించే చురుకైన విధానాలు, అదే సమయంలో సానుకూల మార్కెట్ పనితీరుతో మంచి పనితీరు చూపించింది. అధిక వృద్ధి అవకాశాలు కలిగిన కంపెనీలను ముందుగానే గుర్తించే సామర్థ్యం ఫండ్ మేనేజర్లలో ఉండడం అనుకూలించింది’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. అయినప్పటికీ చిన్న కంపెనీలు స్వల్ప కాలంలో దిద్దుబాట్లకు గురవుతుంటాయని.. లిక్విడిటీ సమస్య కూడా ఉంటుందన్నారు. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించిన వారికి మెరుగైన రాబడులు వస్తాయని సూచించారు. ప్రధానంగా అధిక వృద్ధి సామర్థ్యాలను, రంగాల వారీ సానుకూల సైకిల్స్‌ను ఫండ్ మేనేజర్లు ఆరంభ దశలో గుర్తించి ఆయా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడుల దిశగా ప్రయతి్నంచడం ఈ పథకంలో గుర్తించొచ్చు. అధిక రిస్క్ ఉన్న వారికే ఈ తరహా స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనుకూలమన్నది మర్చిపోవద్దు.
ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం రూ.28,205 కోట్ల పెట్టుబడులు ఈ పథకం నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 92.78 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాల్లో 1.44% పెట్టుబడులు ఉన్నాయి. 5.79% మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పేరుకు స్మాల్‌క్యాప్ ఫండ్ అయినప్పటికీ స్మాల్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు ప్రస్తుతం 31% మేరే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 43% మేర ఇన్వెస్ట్ చేయగా, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 24% మేర ఎక్స్‌పోజర్ కలిగి ఉంది. అయితే ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీల విలువలు గరిష్ట స్థాయిలకు చేరినందున ఎక్స్‌పోజర్ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఆయా విభాగాల వ్యాల్యూషన్ల ఆధారంగా ఈ పెట్టుబడులను మారుస్తుండడం గమనించొచ్చు. అత్యధికంగా 17.56% పెట్టుబడులను ఇంధన రంగ, యుటిలిటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 16%, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 15%, హెల్త్ కేర్ కంపెనీల్లో 14% చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.
