భారీ ఏయూఎం ఉన్న స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చా? | expert insights and discussions on market trends Trading Q and A | Sakshi
Sakshi News home page

భారీ ఏయూఎం ఉన్న స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చా?

Jun 9 2025 8:42 AM | Updated on Jun 9 2025 8:42 AM

expert insights and discussions on market trends Trading Q and A

ఒక స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) భారీ స్థాయికి చేరితే.. అది పనితీరును ప్రభావితం చేస్తుందా? ఏయూఎం ఏ స్థాయి వరకు ఉంటే సురక్షితం?  – రజత్‌

స్మాల్‌క్యాప్‌ పథకాలు పెద్ద స్థాయికి చేరితే పెట్టుబడుల ఆలోచనల పరంగా సమస్యను ఎదుర్కొంటాయి. స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్, డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్‌ల నిర్వహణ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వేర్వేరు మేనేజర్లు నిర్వహించే వివిధ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ను పరిశీలిస్తే వాటి పోర్ట్‌ఫోలియోలో ఏకరూపత 80 శాతం మేర ఉంటుంది. ఎందుకంటే లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ ప్రధానంగా టాప్‌–100 కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌తో మరో వెసులుబాటు ఏంటంటే లిక్విడిటీ సమృద్ధిగా ఉంటుంది. ఒకే రోజు రూ.100–200 కోట్ల పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించినా గానీ పెద్దగా వ్యయ ప్రభావం పడదు. స్మాల్‌క్యాప్‌ విషయంలో ఈ సానుకూలతలు ఉండవు. ఎందుకంటే చాలా స్మాల్‌ క్యాప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1,000–1,500 కోట్ల స్థాయిలోనే ఉంటుంది. రూ.100–200 కోట్ల నిర్వహణ ఆస్తులు నిర్వహించే ఫండ్స్‌ ఈ తరహా చిన్న కంపెనీల్లో చెప్పుకోతగ్గ మేర వాటాను తీసుకోగలవు.

కానీ ఎక్కువ స్థాయిలో ఏయూఎం ఉన్న స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు చిన్న కంపెనీలో 5 శాతం వాటా తీసుకోవడం సాధ్యపడదు. అంతేకాదు ఆ వాటాలను విక్రయించడం కూడా సమస్యగా మారుతుంది. కనుక స్మాల్‌క్యాప్‌ పథకంలో పెట్టుబడుల నిర్వహణ చాలా కష్టం. ఒక్కసారి ఏయూఎం పరంగా స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ పెద్దగా మారిపోతే.. అప్పుడు ఎన్నో కొత్త ఆలోచనలు చేయాల్సి వస్తుంది. లిక్విడిటీ పరంగా చూసినా ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అన్ని కంపెనీలను గుర్తించడం కూడా సవాలే. వ్యాల్యూయేషన్లు ఖరీదుగా లేని కంపెనీలను గుర్తించడం కోసం ఎంతో శ్రమించాల్సి వస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో విజేతలైన పథకాలకు పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతుంటుంది. స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ మంచి రాబడులను చూపిస్తే అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో ఏయూఎం ఇంకా పెద్దది అవుతుంది. పనితీరుపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.

ఇదీ చదవండి: చదువు కొంటున్నారా?

ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో ఏది మెరుగైనది? – దినేష్‌ జనార్దన్‌

వ్యయాల పరంగా చూస్తే ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌) పథకాలకు అనుకూలత ఎక్కువ. 5–7 బేసిస్‌ పాయింట్లకే ఈటీఎఫ్‌ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో 10–15 బేసిస్‌ పాయింట్ల ఎక్స్‌పెన్స్‌ రేషియోకి సేవలు అందించే ఇండెక్స్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్లు సైతం ఉన్నాయి. వ్యయాల పరంగా ఈటీఎఫ్, ఇండెక్స్‌ ఫండ్స్‌ మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. లిక్విడిటీ పరంగా చూస్తే, ఇండెక్స్‌ ఫండ్స్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈటీఎఫ్‌ల విషయంలో లిక్విడిటీ వివిధ పథకాల మధ్య కొంత భిన్నంగా ఉండొచ్చు. కొన్ని పథకాలు రోజువారీగా అధిక వ్యాల్యూమ్‌ (పరిమాణం)లో ట్రేడ్‌ అవుతుంటాయి. కనుక ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు ఆయా పథకాల ట్రేడింగ్‌ పరిమాణాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసేట్టు అయితే ఇండెక్స్‌ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలను ఈటీఎఫ్‌ కోసం తెరవాల్సిన శ్రమ తప్పుతుంది. డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలున్న వారికి ఈటీఎఫ్‌లు కూడా మెరుగైన ఎంపికే అవుతుంది.


 

Advertisement
 
Advertisement
Advertisement