ఉత్పత్తులు నేరుగా సరఫరా చేయండి 

Call for exporters to the United Nations - Sakshi

ఎగుమతిదారులకు ఐక్యరాజ్య సమితి పిలుపు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘వివిధ దేశాలకు చెందిన విక్రేతలు భారత్‌ నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసి  ఐక్యరాజ్యసమితికి సరఫరా చేస్తున్నారు. అలా కాకుండా తయారీదారులే నేరుగా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి’ అని ఐక్యరాజ్యసమితి ప్రొక్యూర్‌మెంట్‌ డివిజన్‌ సీనియర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఆఫీసర్‌ బ్రూనో మబోజా చెప్పారు. ‘యునైటెడ్‌ నేషన్స్‌తో వ్యాపార అవకాశాలు’ అన్న అంశంపై గురువారం ఫ్యాప్సీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఎగుమతిదారులతో మాట్లాడారు. ఐరాసతో (యూఎన్‌) వ్యాపారం చేయడం చాలా సులభమన్నారు. ‘‘కాకపోతే ఉత్పత్తులు గానీ, సేవలు గానీ నిబంధనలకు అనుగుణంగా ఉండి తీరాలి. ‘2017లో పలు దేశాల నుంచి యునైటెడ్‌ నేషన్స్‌ చేసిన కొనుగోళ్ల విలువ రూ.1,26,000 కోట్లు. ఇందులో భారత్‌ రూ.6,350 కోట్ల విలువైన ఎగుమతులతో రెండవ స్థానంలో ఉంది’ అని  వివరించారు. 

కొనుగోలు కేంద్రం పెట్టండి..: ఐక్యరాజ్యసమితి ప్రొక్యూర్‌మెంట్‌ డివిజన్‌ ప్రాంతీయ కొనుగోలు కేంద్రం హైదరాబాద్‌లో నెలకొల్పాల్సిందిగా భారత విదేశాంగ శాఖ, హైదరాబాద్‌ బ్రాంచ్‌ సెక్రటేరియట్‌ హెడ్, రీజినల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ ఇ.విష్ణువర్ధన్‌ రెడ్డి కోరారు. ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ నిబంధనలు ఇక్కడి ఎగుమతిదార్లకు అనుగుణంగా రూపొందించాలని అభ్యర్థించారు. ఫార్మా వంటి ఉత్పత్తుల ఎగుమతికోసం నిర్దేశించిన టెక్నికల్‌ స్పెసిఫికేషన్లలో అడ్డంకులు ఉన్నాయని, వాటిని తొలగించాలని కోరారు. యూఎన్‌కు ఎగుమతులకై ఇక్కడి వ్యాపారులకు సాయపడేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఒకటి ఏర్పాటు చేయాలని తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఫ్యాప్సీని కోరారు. అడ్డంకులను తొలగించడం ద్వారా రాష్ట్రం నుంచి ఎగుమతులను పెంచేందుకు బలమైన వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top