ఐఆర్‌డీఏఐ, ఫెడరల్‌ ఇన్సూరెన్స్‌ డీల్‌కు ఓకే 

Cabinet approves MoU between IRDAI and FIO - Sakshi

పోస్టల్‌ బ్యాంక్‌  వ్యయాల పరిమితి పెంపు

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు 

న్యూఢిల్లీ: భారతీయ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ, అమెరికా ఫెడరల్‌ ఇన్సూరెన్స్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఐవో) మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. నియంత్రణ పరమైన బాధ్యతలు, అనుభవాలు మొదలైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు, శిక్షణా తదితర కార్యకలాపాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని క్యాబినెట్‌ బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పడం, ఆర్థిక స్థిరత్వం సాధించడం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం తదితర అంశాల్లో సహకరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. దేశీ బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచిన నేపథ్యంలో ఎఫ్‌డీఐలు.. ముఖ్యంగా అమెరికా నుంచి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐఆర్‌డీఏఐ, ఎఫ్‌ఐవో మధ్య ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం ఇందుకు తోడ్పడగలదని ప్రభుత్వం పేర్కొంది.  

మరోవైపు, ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) వ్యయాల పరిమితిని 80 శాతం మేర పెంచే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ పరిమితి రూ.800 కోట్ల నుంచి రూ. 1,435 కోట్లకు చేరుతుంది. సెప్టెంబర్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా ఐపీపీబీ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. ఐపీపీబీ 650 శాఖలు, 3,250 యాక్సెస్‌ పాయింట్స్‌తో సేవలు ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవింగ్స్‌ .. కరెంట్‌ అకౌంట్లు, మనీ ట్రాన్స్‌ఫర్, ప్రత్యక్ష నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులు వంటి ఆర్థిక సేవలు అందిం చనుంది. ఐపీపీబీ మూడేళ్లలో లాభాల్లోకి మళ్లవచ్చని అంచనాలు ఉన్నాయి. 2018 డిసెంబర్‌ 31 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసులను ఈ వ్యవస్థకు అనుసంధించడం పూర్తి కాగలదని  కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా  తెలిపారు.

తెలంగాణలోనూ సెప్టెంబర్‌ 1 నుంచే 
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు సేవలు తెలంగాణలో 23 శాఖలు, 115 యాక్సెస్‌ పాయింట్లలో సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం అవుతాయని తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. 17 కోట్లకు పైగా పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాదారులతో కలిపి ఐపీపీబీకి దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నట్టు చెప్పారు. డిసెంబర్‌ నాటికి 1.55 లక్షల పోస్టాఫీసులను పేమెంట్స్‌ బ్యాంకుతో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top