ఆదివారం ఉచిత కాలింగ్ ఆఫర్‌ పొడిగింపు

BSNL Extends Free Sunday Calling Offer Again - Sakshi

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎన్‌ఎన్‌ఎల్‌) తన సబ్‌స్క్రైబర్లకు ఆదివారం ఉచిత వాయిస్‌ కాలింగ్‌ ఆఫర్‌ను పొడిగించింది. ల్యాండ్‌లైన్‌కు, కోంబోకు, ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లకు 2016 నుంచి అందిస్తున్న ఈ ప్రయోజనాలను మరోసారి పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ సండే కాల్స్‌ ఆఫర్‌ను క్లోజ్‌ చేయాలని గత జనవరిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది. కానీ ఫిబ్రవరిలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, మరో మూడు నెలల పాటు ఈ ప్రయోజనాలను పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అంటే ఏప్రిల్‌ 30తో ఈ ఆఫర్‌ ప్రయోజనాల గడువు పూర్తి కాబోతోంది. ప్రస్తుతం మరోసారి ఈ ఆఫర్‌ను మే 1 నుంచి పొడిగించనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. అయితే ఎంతకాలం పాటు ఈ ప్రయోజనాలను అందించనున్నదో తెలుపలేదు. 

తదుపరి నోటీసులు వచ్చేంత వరకు ఈ ఉచిత కాలింగ్‌ ప్రయోజనాలను బీఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రైబర్లు పొందవచ్చు. ఈ ఆఫర్‌ కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్లు ఆదివారం రోజు ఉచితం దేశవ్యాప్తంగా ఉన్న ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు.  ఆదివారం ఉచిత కాలింగ్‌ ఆఫర్‌ను పొడిగించడమే కాకుండా.. రాత్రి పూట అందించే వాయిస్‌ కాలింగ్‌ సమయాలను మార్చింది. అంతకముందు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అందించే వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాన్ని ప్రస్తుతం రాత్రి 10.30 గంటల నుంచి ఉదయం 6 గంటలకు మార్చింది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణాన్ని తెలుపలేదు. ఇటీవల ప్రైవేట్‌ టెలికాం కంపెనీల నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో కూడా రూ.349తో డేటా, వాయిస్‌ కాలింగ్‌తో కొత్త ప్రీపెయిడ్ మొబైల్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. అదనంగా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలతో రూ.99, రూ.319 ప్లాన్లను ప్రవేశపెట్టింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top