చమురు మంట తగ్గినా... గృహోపకరణాలు చల్లారలేదు 

Boom in antique furniture driven by environmentally-conscious millennials  - Sakshi

నెల రోజుల్లో రూపాయి  5 శాతం రికవరీ

చమురు ధరలు ఏకంగా 30 శాతం తగ్గుదల

అయినా గృహోపకరణాల  ధరల పెరుగుదల

పండుగల సీజన్‌ ముగియటంతో అమల్లోకి

న్యూఢిల్లీ: చమురు ధరలు శాంతించాయి... డాలర్‌తో రూపాయి కొంచెం బలం పుంజుకుంది. అయినా, గృహోపకరణాల ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఇటీవలి కాలంలో బ్యారెల్‌కు 80 డాలర్ల వరకు వెళ్లి తిరిగి 60 డాలర్ల లోపునకు పడిపోగా... డాలర్‌తో 74కు పైగా దిగజారిన రూపాయి తిరిగి 71 లోపునకు వచ్చేసింది. డాలర్‌ మారకంలో రూపాయి పతనం వల్ల ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాల తయారీ సంస్థలకు ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో అవి ధరల్ని పెంచటం మొదలెట్టాయి. కానీ, రూపాయి రివకరీతో వినియోగదారులకు లాభించిందేమీ లేదు. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు రెండో విడత ధరల పెంపును నిలిపివేసినప్పటకీ, గృహోపకరణాల తయారీ సంస్థలు మాత్రం ధరల్ని పెంచుతూనే ఉన్నాయి. దీనికి కారణం అధిక కస్టమ్స్‌ డ్యూటీయేనని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. రూపాయి డాలర్‌తో 67–68 స్థాయి పైనే ఉందని, తమ తయారీ వ్యయాలన్నీ గతంలో ఈ స్థాయి ఆధారంగానే అంచనా వేసినవని వారు చెబుతున్నారు. దీంతో తమ మార్జిన్లపై ఒత్తిడి ఉందంటున్నారు. ‘‘దిగుమతి చేసుకునే ఖరీదైన ఉత్పత్తుల ఎంఆర్‌పీలను 7– 10 శాతం మధ్యలో పెంచడం జరిగింది. మధ్య స్థాయి ఉత్పత్తులపై ఈ పెంపు 4–5 శాతం మధ్యనే ఉంది’’ అని హేయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రజంగ తెలిపారు. మరోవైపు శామ్‌సంగ్, ఎల్‌జీ కంపెనీలు రానున్న వారాల్లో ధరల పెంపును అమలు చేయనున్నట్లు తెలిసింది. వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌ ఓవెన్‌లు తదితర ఉత్పత్తులపై 3–5 శాతం మేర పెంపు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  

ఏసీలపై త్వరలోనే బాదుడు 
ఇక ఏసీ తయారీ కంపెనీలు 2019 సీజన్‌కు ముందు తయారయ్యే నూతన స్టాక్‌పై వచ్చే నెలలో రేట్లు పెంచొచ్చని అంచనా. దిగుమతి చేసుకునే వాటి ధరలు పెరగడమే దీనికి కారణం. దేశీయ ఏసీ పరిశ్రమలో 30% దిగుమతి ఆధారితంగా తయారయ్యేవేనని ఎడెల్వీజ్‌ బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లతో పోలిస్తే ఏసీల్లో ఎక్కువ విడి భాగాలు దిగుమతుల ద్వారానే వస్తున్నాయి. చైనా, థాయిలాండ్, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్‌ నుంచి ఇవి దిగుమతవుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషీన్లపై (10 కిలోల కంటే తక్కువ లోడ్‌) బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 10% కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో పెంచింది. దీంతో ఈ ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీ 20 శాతానికి చేరింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో వాడే కంప్రెషర్లపై కస్టమ్స్‌ సుంకం 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత చాలా వరకు కంపెనీలు ఉత్పత్తులపై రేట్లను పెంచాయి. అయితే, ఆ వెంటనే పండుగలు ఉండడంతో ధరల పెంపును మాత్రం వెంటనే అమలు చేయలేదు. ఆ పెంపును ఇప్పుడు అమల్లో పెడుతున్నట్టు గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌నంది తెలిపారు. పండుగల సందర్భంగా వ్యాపారులకిచ్చిన తగ్గింపులు, సబ్సిడీలను కూడా ఉపసంహరించుకున్నట్లు తెలియజేశారు. రూపాయి మారకం విలువలో ఆటుపోట్ల కారణంగా గత ఏడాది కాలంలో కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ కంపెనీలు ఉత్పత్తుల ధరలను మూడు సార్లు పెంచాయి. గతేడాది డిసెంబర్‌లో, ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో మూడు సార్లు కస్టమ్స్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top