బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా భేష్‌!

BoB Sept qtr profit grows 20% on retail show - Sakshi

క్యూ2 లాభం రూ.425 కోట్లు; 20 శాతం వృద్ధి

మెరుగుపడిన రుణ నాణ్యత

8 శాతం వృద్ధితో రూ.13,430 కోట్లకు మొత్తం ఆదాయం

ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో రూ.425 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.355 కోట్ల నికర లాభం వచ్చిందని 20 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది.

మొండి బకాయిల పరిస్థితి మెరుగుపడటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 40 శాతం పెరిగి రూ.686 కోట్లకు ఎగిసిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.12,490 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం  ఈ క్యూ2లో 8 శాతం వృద్ధితో రూ.13,430 కోట్లకు పెరిగిందని వివరించింది.

నికర వడ్డీ ఆదాయం 21 శాతం అప్‌
నికర వడ్డీ ఆదాయం రూ.3,720 కోట్ల నుంచి 21 శాతం పెరిగి రూ.4,492 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. ఈ క్యూ2లో తాజా మొండి బకాయిలు రూ.2,281 కోట్లుగా ఉన్నాయని, గత ఏడాదిన్నర కాలంలో ఇవే అతి తక్కువ తాజా మొండి బకాయిలని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. గత క్యూ2లో 5.40 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 4.86 శాతానికి తగ్గాయని వెల్లడించింది.

ఈ క్యూ1లో 12.46 శాతంగా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ క్యూ2లో 11.8 శాతానికి తగ్గాయని తెలిపింది. మొండి బకాయిల కోసం రూ.1,467 కోట్ల కేటాయింపులు జరిపామని, ఇది తొమ్మిది క్వార్టర్ల కనిష్ట స్థాయని వివరించింది. మొత్తం కేటాయింపులు  4 శాతం పెరిగి రూ.2,430 కోట్లకు పెరిగాయని పేర్కొంది. గత క్యూ2లో 1.82 శాతంగా ఉన్న రుణ వ్యయం ఈ క్యూ2లో 1.31 శాతానికి తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్‌ 2.34 శాతం నుంచి 2.61 శాతానికి పెరిగిందని తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, ఇది స్వల్పంగా తగ్గింది.

మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్‌ 2.7 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top