భారీగా పతనమైన బిట్‌కాయిన్‌

Bitcoin dips below $10,000 for first time since December - Sakshi

బిట్‌కాయిన్‌ అసలు వ్యవహారం ఇప్పుడిప్పుడే బట్టబయలవుతోంది. రాకెట్‌ వేగంతో దూసుకుపోయిన బిట్‌కాయిన్‌ విలువ వరుసగా కొన్ని వారాల నుంచి నేల చూపులు చూస్తోంది. బుధవారం ట్రేడింగ్‌లో ఏకంగా 12 శాతం పతనమై, 10వేల డాలర్ల కిందకి పడిపోయింది. డిసెంబర్‌ నుంచి 10వేల డాలర్లకు కింద ట్రేడవడం, ఇదే తొలిసారి.  గతేడాది డిసెంబర్‌లో ఇది 19,800 డాలర్లగా నమోదైన సంగతి తెలిసిందే. నెల వ్యవధిలో దాదాపు 50 శాతం మేర అంటే ఏకంగా10వేల డాలర్ల విలువ పతనమైంది. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా దారుణంగా పడిపోతున్నట్టు  తెలిసింది. కాయిన్‌డెస్క్‌ న్యూస్‌ సైట్‌ ధరల ఇండెక్స్‌ ప్రకారం ఒక్క బిట్‌ కాయిన్‌ విలువ నేడు 9,958 డాలర్లుగా నమోదైంది.

దక్షిణ కొరియా, చైనాలాంటి దేశాలు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ను నిషేధిస్తాయన్న వార్తల నేపథ్యంలో వీటి విలువలు పడిపోతున్నట్టు వెల్లడైంది. దొరికినకాడికి అమ్ముకొని బయటపడదామని అందరూ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ మార్కెట్లలో దక్షిణ కొరియా ఒకటి. దక్షిణ కొరియానే వీటి ట్రేడింగ్‌ను నిషేధించడం బిట్‌కాయిన్‌ ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలు రేపుతోంది. క్రిప్టోకరెన్సీలపై వివిధ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీటి విలువ మరింత పతమవడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ చర్యలు కూడా ఊపందుకుంటున్నాయి. గతేడాది బిట్‌కాయిన్ ఏకంగా 2000 శాతం పెరిగిన విషయం తెలిసిందే.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top