భారత్‌ బయోటెక్‌ చేతికి  చిరోన్‌ బెహరింగ్‌ వ్యాక్సిన్స్‌

Bharat Biotech acquires Chiron Behring Vaccines from GSK for undisclosed amount - Sakshi

రేబిస్‌ వ్యాక్సిన్లలో కంపెనీ స్థానం  మరింత బలోపేతం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ భారత్‌ బయోటెక్‌.. యూకేకు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లిన్‌ (జీఎస్‌కే) ఏషియాకు చెందిన చిరోన్‌ బెహరింగ్‌ వ్యాక్సిన్స్‌ను కొనుగోలు చేయనుంది.  పూర్తిగా నగదు రూపంలో 100 శాతం వాటాను దక్కించుకోనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై శుక్రవారం ఇక్కడ ఒప్పందం జరిగింది. డీల్‌ విలువ ఎంతనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా విలేకరులతో మాట్లాడుతూ... ‘‘చిరోన్‌ బెహరింగ్‌కు గుజరాత్‌లోని అంకళేశ్వర్‌లో రేబిస్‌ టీకా తయారీ కేంద్రం ఉంది. దీని వార్షిక సామర్థ్యం 1.5 కోట్ల మోతాదులు (డోస్‌లు). భారత్‌ బయోటెక్‌ రేబిస్‌ టీకా ప్లాంట్‌ సామర్థ్యం కోటి డోస్‌లు.

తాజాగా చిరోన్‌ కొనుగోలుతో మా మొత్తం వార్షిక సామర్థ్యం 2.5 కోట్ల మోతాదులకు పెరిగింది. దీంతో రేబిస్‌ వ్యాక్సిన్‌ తయారీ, మార్కెట్‌లలో గ్లోబల్‌ లీడర్‌ అవుతాం’’ అని వివరించారు. ఏటా రేబిస్‌ వ్యాధితో 55 వేల మంది మరణిస్తున్నారని.. ఇందులో 36 శాతం ఇండియాలో ఉంటున్నాయని పేర్కొన్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రీ–అప్రూవ్డ్‌ అనుమతి పొందిన భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్స్‌ను 70 దేశాల్లో మార్కెట్‌ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 16 వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, వచ్చే 3–4 ఏళ్లలో మరో 6 వ్యాక్సిన్లను మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top