
భారతదేశంలో తన ఆంకాలజీ ఔషధాలను ప్రారంభిస్తున్నట్లు జీఎస్‌కే కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారతీయ మహిళల్లో పెరుగుతున్న ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్లను పరిష్కరించడానికి జెంపెర్లి (డోస్టార్లిమాబ్), జెజులా (నిరాపారిబ్)లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది.
జెంపెర్లి.. ఇమ్యునోథెరపీ
డీఎంఎంఆర్ / ఎంఎస్ఐ-హెచ్ అధునాతన ఎండోమెట్రియల్ క్యాన్సర్ చికిత్స కోసం భారతదేశంలో మొదటగా ఆమోదించబడిన పీడీ-1 ఇమ్యునోథెరపీగా గుర్తించబడింది. ఇది గార్నెట్ ట్రయల్ ఆధారంగా 45.5% ప్రతిస్పందన రేటు నమోదు చేసింది. 24 నెలల వరకు స్థిరమైన ప్రయోజనాలను చూపించినట్లు కంపెనీ తెలిపింది. ఇది క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీకి ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
జెజులా.. అండాశయ క్యాన్సర్ ఔషధం
ఇది బయోమార్కర్ విధానాల్లో మోనోథెరపీ నిర్వహణ కోసం భారతదేశంలో ఆమోదించబడిన ఏకైక రోజువారీ పీఏఆర్‌పీ ఇన్‌హిబిటర్ చికిత్స. అధిక-ప్రమాదం ఉన్న రోగుల్లో ఉపశమనాన్ని అందించడానికి ప్రైమా ట్రయల్‌లో మెరుగైన ఫలితాలు అందించింది.
ఇదీ చదవండి: యూఎస్‌లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది?
2045 నాటికి భారతదేశంలో ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్ కేసులు వరుసగా 78%, 69% పెరుగుతాయని అంచనా. మహిళల క్యాన్సర్ సంరక్షణలో ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన రోగులకు జీఎస్‌కే అందిస్తున్న చికిత్సలు ఎంతో తోడ్పడుతాయని కంపెనీ పేర్కొంది. రోగులకు సహాయం అందించేందుకు జీఎస్‌కే ‘ఫీనిక్స్’ అనే పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో ఈ చికిత్సలు కీలకంగా మారుతాయని జీఎస్‌కే ఇండియా ఎండీ భూషణ్ అక్షికర్ అన్నారు. జెంపెర్లి, జెజులా గైనకాలజికల్ క్యాన్సర్ చికిత్సకు ఎంతో తోడ్పడుతాయని చెప్పారు.